కుహనా లౌకికవాదులను తరిమికొడదాం

ప్రధానాంశాలు

కుహనా లౌకికవాదులను తరిమికొడదాం

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

హామీలు మరచిన కేసీఆర్‌: జావడేకర్‌

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి: తెలంగాణ గడ్డ హిందువుల అడ్డా... ఇక్కడ పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్న కుహనా లౌకికవాదులను తరిమికొడదామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. 25వ రోజు ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. 80 శాతం హిందువులున్న దేశంలో రాముడి గుడి కట్టేందుకు ఇంత సమయం పడుతుందా అనే చర్చ ప్రపంచమంతా జరిగిందన్నారు. 1400 మంది ఆత్మబలిదానాలు చేస్తే తెలంగాణ సిద్ధించిందని, ఆ ఫలాలను కేసీఆర్‌ కుటుంబం అనుభవిస్తోందని ఆరోపించారు. ఏడున్నరేళ్లుగా నియామకాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే సీఎం కనీసం స్పందించలేదన్నారు. బోనమెత్తి, బతుకమ్మ ఆడి ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించిన కామారెడ్డి జిల్లా అక్కాచెల్లెళ్లను ఎప్పటికీ మరువలేమన్నారు. భవిష్యత్తులో సంక్షేమ పథకాలు రావాలంటే మద్యం తాగాలనే నిబంధన పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు.

కర్షకుల కష్టాలు తీర్చాలి

గతంలో రైతులు పండించిన ప్రతి గింజనూ కేంద్రంతో సంబంధం లేకుండా తామే కొంటామని ప్రకటించిన కేసీఆర్‌.. ఇప్పుడు తమకు సంబంధం లేదంటున్నారని విమర్శించారు. కేంద్రం కొనగా మిగిలే బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసి అన్నదాతలను ఆదుకోవచ్చని చెప్పారు. మక్కలు కొనకున్నా, రైతులను ఇబ్బంది పెట్టినా ఫామ్‌హౌస్‌ను ముట్టడిస్తామని, అవసరమైతే నాగళ్లతో దున్నేస్తామని హెచ్చరించారు. సభలో కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ మాట్లాడుతూ, కేసీఆర్‌ ముఖ్యమంత్రి పీఠం ఎక్కగానే ప్రజలకిచ్చిన హామీలు మరిచిపోయారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన ఆయుష్మాన్‌ భారత్‌ను కొవిడ్‌ రాకముందే తెలంగాణ ప్రభుత్వం అమలు చేసి ఉంటే చాలా మంది ప్రాణాలు కాపాడగలిగేవారని అన్నారు. మోదీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాలకు నిధులు పెంచారని గుర్తుచేశారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు సిరిసిల్ల జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశమై పాదయాత్ర రూట్‌మ్యాప్‌పై చర్చించారు.

300 కి.మీ.కు చేరిన యాత్ర

ప్రజా సంగ్రామ యాత్ర 300 కి.మీ.పూర్తయింది. ఆగస్టు 28న హైదరాబాద్‌లో ప్రారంభమైన యాత్ర మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రం నిజాంసాగర్‌ చౌరస్తా వద్ద ఈ మైలురాయిని చేరింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు టపాసులు కాల్చి, బెలూన్లు ఎగురవేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని