తెలంగాణను బిహార్‌లా మారుస్తున్నారు

ప్రధానాంశాలు

తెలంగాణను బిహార్‌లా మారుస్తున్నారు

సీఎం కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి విమర్శ

జూబ్లీహిల్స్‌, గాంధీభవన్‌, న్యూస్‌టుడే: సీఎం కేసీఆర్‌ తెలంగాణను బిహార్‌లా మారుస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. దాడులు చేయడానికి వచ్చిన వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకుండా, తనను కలవడానికి ఇంటికి వచ్చిన వారిపై కేసులు నమోదు చేయడమేంటని పోలీసులను ప్రశ్నించారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని తన నివాసం వద్ద మంగళవారం తెరాస విద్యార్థి విభాగం, కాంగ్రెస్‌ శ్రేణుల మధ్య ఘర్షణ నేపథ్యంలో తెరాస ఫిర్యాదు స్వీకరించి కేసులు నమోదు చేసిన పోలీసులు, కాంగ్రెస్‌ ఫిర్యాదుపై స్పందించడం లేదని ఆరోపించారు. దీనిపై బుధవారం ఆయన జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి.. అక్కడ ఉన్న పశ్చిమ మండల డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌, అదనపు డీసీపీ ఇక్బాల్‌ సిద్దిఖీ, ఏసీపీ సుదర్శన్‌, జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌రెడ్డిలను ప్రశ్నించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘అర్ధరాత్రి వేళ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వెళ్లి కాంగ్రెస్‌ నేతలను అక్రమ అరెస్ట్‌లు చేశారు. ఈ వ్యవహారంతో టాస్క్‌ఫోర్స్‌కు పనేంటి? కాంగ్రెస్‌ శ్రేణులపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగానికీ ప్రయత్నిస్తున్నారని సమాచారం. అదే జరిగితే మర్యాదగా ఉండదు. పోలీసుల సమక్షంలోనే దాడులు జరిగితే ఇంతవరకు తెరాస శ్రేణులపై ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు నమోదు చేయలేదు. తెలంగాణలో ఇక్కడి సంస్కృతిని ప్రతిబింబించేలా పరిపాలన ఉండాలి తప్ప బిహార్‌లో గతంలో ఉన్న అరాచక పాలన ఉండొద్దు. నా భద్రత విషయంలో తెలంగాణ పోలీసులు, కేంద్ర హోంశాఖ వైఖరిపై మరోమారు కోర్టు తలుపు తడతా’’ అని రేవంత్‌రెడ్డి చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇంటిపై దాడికి ప్రేరేపించిన వారిపై కేసులు నమోదు చేయాలని పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షులు జి.నిరంజన్‌ డీజీపీ మహేందర్‌రెడ్డికి బుధవారం లేఖ రాశారు.

ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశామన్న పోలీసులు

రేవంత్‌రెడ్డి నివాసం వద్ద ఘర్షణ విషయంలో ఇరువర్గాలపై కేసులు నమోదు చేసినట్లు జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. తెరాస విద్యార్థి విభాగం నేత కడారి స్వామి ఫిర్యాదుతో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నరేశ్‌కుమార్‌, రవీంద్రనాయక్‌, వన్నేరు గణేశ్‌ తదితరులపై కేసులు నమోదు చేశామన్నారు. రేవంత్‌రెడ్డి వ్యక్తిగత సహాయకుడు పురుషోత్తంరెడ్డి ఫిర్యాదుతో తెరాస విద్యార్థి విభాగం శ్రేణులపైనా కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని