ఛార్జీల పెంపు విరమించుకోవాలి

ప్రధానాంశాలు

ఛార్జీల పెంపు విరమించుకోవాలి

ఆర్టీసీ ఆస్తులు అమ్ముకునేందుకు సీఎం కుట్ర
బండి సంజయ్‌ ధ్వజం

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి: ఆర్టీసీ, విద్యుత్తు ఛార్జీల పెంపు ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 26వ రోజు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. కేంద్రం ఇంధన ధరలు పెంచిందన్న సాకుతో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో లీటరుపై రూ.40 తన ఖాతాలో జమ చేసుకుంటోందన్నారు. తాజాగా ఆర్టీసీ ఛార్జీలు పెంచేందుకు సిద్ధమైందని చెప్పారు. రైతులకు ఉచిత విద్యుత్తు పేరుతో ఇళ్లకు వేసే ఛార్జీలను పెంచుతోందని విమర్శించారు. దేశ జీడీపీలో తెలంగాణ రాష్ట్రం టాప్‌ అని ప్రకటించిన కేసీఆర్‌కు ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. సంఘాలను చీల్చి ఆర్టీసీ ఆస్తులు అమ్ముకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. అందుకే అశ్వత్థామరెడ్డిని తొలగించారని విమర్శించారు. మల్టీప్లెక్సులు, షాపింగ్‌ కాంప్లెక్సుల పేరుతో ఆర్టీసీ విలువైన స్థలాలను తెరాస నాయకులు స్వాధీనం చేసుకునే కుట్ర జరుగుతోందన్నారు. కుటుంబాలను పోషించుకోలేని దీనస్థితిలో 27 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములకు పట్టాదారు పాసుపుస్తకాలివ్వకపోవడంతో రైతులు ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారన్నారు. ఇందిరాపార్కులో ధర్నాలు చేస్తున్న కొన్ని పార్టీలను 80 శాతం డిస్కౌంటుతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎప్పుడో కొనేశారని ఎద్దేవా చేశారు. అవన్నీ టైంపాస్‌ ధర్నాలేనని విమర్శించారు.

మహిళలపై పెరిగిన దాడులు

పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు రేఖావర్మ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలు, బాలికలపై దాడులు పెరిగాయని పేర్కొన్నారు. అత్యాచారాల్లో తెలంగాణ దేశంలోనే నాలుగో స్థానంలో ఉందన్నారు. బండి సంజయ్‌ పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూస్తుంటే రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరేయడం ఖాయమన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని