కేసీఆర్‌ కుట్రలను హరీశ్‌ అమలు చేస్తున్నారు

ప్రధానాంశాలు

కేసీఆర్‌ కుట్రలను హరీశ్‌ అమలు చేస్తున్నారు

సీఎంకు కలలోనూ నేనే కనిపిస్తున్నా
నన్ను రాజకీయంగా  బొంద పెట్టాలని చూస్తున్నారు: ఈటల

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌- న్యూస్‌టుడే, హుజూరాబాద్‌: పేదల గొంతుకనైన తనను ఓడించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తనను అసెంబ్లీలో చూడకూడదన్నట్లు వ్యవహరిస్తున్నారని, తనపై రాజకీయంగా పైచేయి సాధించేందుకు పరిపాలనను గాలికొదిలేశారని విమర్శించారు. గురువారం హుజూరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘మంత్రివర్గం నుంచి బయటకు వచ్చిన 4 నెలల 20 రోజుల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలను నాపైకి ఉసిగొల్పుతున్నారు. హుజూరాబాద్‌లో తెరాస ఓడిపోతుందనే భయంతో కేసీఆర్‌కు పడుకున్నా, లేచినా, కలలోనూ నేనే కనిపిస్తున్నా. నీచమైన కుట్రల్ని ఆయన రచిస్తుంటే.. మంత్రి హరీశ్‌రావు ఇక్కడ అమలు చేస్తున్నారు. కోట్ల రూపాయల్ని ఖర్చు చేస్తున్నారు. అప్పటికప్పుడు జీవోలిస్తున్నారు. కులసంఘాలకు దావత్‌లిస్తూ మంత్రులే వారికి వడ్డిస్తున్నారు. సంఘాల మీద ప్రేమతో ఇవన్నీ కేసీఆర్‌ చేయడం లేదు. వారిని ప్రలోభపెడుతూ.. హామీల రూపంలో కత్తిని అందిస్తూ నన్ను రాజకీయంగా బొందపెట్టాలని చూస్తున్నారు. నాపై ఎవరెన్ని కుట్రలు పన్నినా.. ఎవరి ఉచ్చులో వారే పడతారు’’ అని ఈటల ఘాటుగా విమర్శలు చేశారు. ‘‘కాళీ మాతనని ప్రకటించుకున్న ఇందిరాగాంధీ, నా చెప్పును పెట్టినా గెలుస్తుందన్న ఎన్టీఆర్‌లాంటి పెద్ద నాయకులే ఓడిపోయారు. నాపై కుట్రలు చేసే వారికీ అదే గతి పడుతుంది’’ అని జోస్యం చెప్పారు. కేసీఆర్‌ నిర్వాకంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలైందని ఈటల వ్యాఖ్యానించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని