2 తర్వాత దళిత ఉద్యమం

ప్రధానాంశాలు

2 తర్వాత దళిత ఉద్యమం

ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్‌

ఈనాడు డిజిటల్‌- సిరిసిల్ల, ఈనాడు-హైదరాబాద్‌: రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దళితబంధు పథకాన్ని అమలు చేయాలంటూ వచ్చే నెల 2 తర్వాత ఉద్యమం ప్రారంభించనున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రకటించారు. పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తామన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల నుంచి ప్రారంభమైంది. గంభీరావుపేట మార్కెట్ కూడలిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మొదటి విడత పాదయాత్ర హుజూరాబాద్‌లో అక్టోబరు 2న ముగుస్తుందని వెల్లడించారు.

ఏకగ్రీవ నజరానాలు ఏమయ్యాయి?
ఏకగ్రీవ పంచాయతీలకు  ప్రభుత్వ నజరానా ఇస్తామన్న హామీ నేటికీ అమలుకు నోచుకోలేదని సంజయ్‌ విమర్శించారు. ఇటీవల సిద్దిపేట జిల్లాకు చెందిన ఒక ఎంపీటీసీ సభ్యుడు మంత్రి హరీశ్‌రావును నిధులు కోరితే.. ఎంపీటీసీ పదవిపై చులకనగా మాట్లాడటం ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు నిదర్శనమన్నారు. ఈ నెల 23వ తేదీ వచ్చినా ఆసరా పింఛన్లు ఇవ్వలేకపోవడాన్ని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్‌ మత్తు, ఇసుక, భూమాఫియాగా మార్చారన్నారు.

మీ కుమారుడిని ఏమనాలి?
పనులు చేయని మంత్రులు, ప్రజాప్రతినిధులను దద్దమ్మలు అని సంబోధించే ముఖ్యమంత్రి కేసీఆర్‌.. సిరిసిల్ల నియోజకవర్గం ఎగువమానేరు వద్ద సిద్దిపేట-కామారెడ్డి రహదారిపై ఏడేళ్లుగా వంతెన నిర్మించలేని ఆయన కుమారుడిని ఏమనాలని సంజయ్‌ ప్రశ్నించారు. పార్టీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యేలు రఘునందన్‌రావు, రాజాసింగ్‌లతో పాటు మృత్యుంజయం, బొడిగె శోభ తదితరులు పాల్గొన్నారు.

సిరిసిల్ల నియోజకవర్గంలో ఈ నెల 25 వరకు, ఆ తర్వాత మానకొండూరు, హుస్నాబాద్‌ నియోజకవర్గాల్లో 30 వరకు సాగుతుందని పాదయాత్ర ఇన్‌ఛార్జి జి.మనోహర్‌రెడ్డి గురువారం తెలిపారు. ముగింపు సభకు జాతీయ అధ్యక్షుడు నడ్డాను ఆహ్వానించినా కుటుంబసభ్యుల్లో ఒకరు అనారోగ్యంతో ఉండటంతో రావడం లేదని ఆయన కార్యాలయం నుంచి సమాచారం అందింది. దీంతో పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి ఎవరిని ఆహ్వానించాలి? బహిరంగ సభ పెట్టాలా? రోడ్‌షోతో ముగించాలా? తదితర విషయాలపై కమలనాథులు చర్చిస్తున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని