ఏపీని వదిలి తెలంగాణకు వచ్చేస్తా..! ఇక్కడి రాజకీయాలే బాగున్నాయి

ప్రధానాంశాలు

ఏపీని వదిలి తెలంగాణకు వచ్చేస్తా..! ఇక్కడి రాజకీయాలే బాగున్నాయి

విలేకరులతో తెదేపా నేత జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యలు

ఈనాడు, హైదరాబాద్‌: తాను ఆంధ్రప్రదేశ్‌ను వదిలి తెలంగాణకు వచ్చేస్తానని ఆ రాష్ట్ర తేదేపా నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. ఏపీ రాజకీయాల కంటే ఇక్కడి రాజకీయాలే బాగున్నాయని అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ శాసనసభకు వచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లతో భేటీ అయ్యారు. అనంతరం సీఎల్పీ కార్యాలయంలో కాంగ్రెస్‌ నేతలు భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డిలను కలిశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పటి వరకు కలవలేదని అందుకే ఇప్పుడు కలిసి మాట్లాడానని చెప్పారు.

జగన్‌కు హైదరాబాద్‌ నుంచి లారీల్లో డబ్బులొచ్చాయ్‌

‘‘నేను 1980లో సమితి అధ్యక్ష పదవి కోసం రూ.10వేలు ఖర్చు చేశా. ఇప్పుడు ఎంపీగా నిలబడితే రూ.50 కోట్లు ఖర్చవుతోంది. జగన్‌కు ఎన్నికలప్పుడు హైదరాబాద్‌ నుంచి కూడా లారీలలో డబ్బులు వచ్చాయి. అధికారంలో లేని వ్యక్తి.. ఒక్కొక్క ఎమ్మెల్యే అభ్యర్థికి రూ.15 కోట్ల నుంచి 20 కోట్లు ఇచ్చారు. ఎంపీ ఎన్నికల్లో ఒక్కొక్కరు రూ.50 కోట్లు ఖర్చు చేశారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఏపీలో ఓటు రూ.4 వేల నుంచి రూ.5 వేలకు పోతుంది. ఐఏఎస్‌, ఐపీఎస్‌ల పరిస్థితి కూడా అధ్వానంగా మారింది’’ అని జేసీ అన్నారు.

కాంగ్రెస్‌కు నష్టం కలిగించేలా మాట్లాడొద్దు: జీవన్‌రెడ్డి, భట్టి

సీఎల్పీ కార్యాలయానికి వచ్చి కాంగ్రెస్‌ పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడొద్దని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, భట్టి విక్రమార్కలు జేసీకి సూచించారు. కావాలంటే బయట మాట్లాడుకోవాలని చెప్పారు. గత సమావేశాల సందర్భంగానూ శాసనసభకు వచ్చి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వల్ల పార్టీకి నష్టం కలిగిందన్నారు. ఆ మాటలకు స్పందించిన జేసీ... ‘‘జానారెడ్డి నాకు మంచిమిత్రుడు. ఆయన సాగర్‌లో ఓడిపోతారనే బాధతోనే ఆ విషయం ముందే చెప్పా. గెలిచారా? లేదు. ఎందుకు ఓడిపోయారో అందరికీ తెలుసు’’ అని అన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని