నిధులు అడగరు... ఇచ్చిన వాటికి లెక్క చెప్పరు

ప్రధానాంశాలు

నిధులు అడగరు... ఇచ్చిన వాటికి లెక్క చెప్పరు

స్థలం చూపకనే రాష్ట్రానికి రైల్వేకోచ్‌ కర్మాగారం రాలేదు

 కేంద్ర మంత్రి రావ్‌సాహెబ్‌ దాదారావ్‌ దన్వే

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల: ‘దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని మోదీని కలిసి తమ రాష్ట్రాల అభివృద్ధికి నిధులు తీసుకెళ్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రం నిధులు అడగరు. ఇచ్చిన వాటికి ఖర్చులు చూపరు. పైగా కేంద్రం నిధులివ్వడంలేదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అని కేంద్ర రైల్వే, బొగ్గు గనులశాఖ సహాయ మంత్రి రావ్‌సాహెబ్‌ దాదారావ్‌ దన్వే ఆరోపించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర రాజన్న సిరిసిల్ల జిల్లా శుక్రవారం 28వ రోజు గంభీరావుపేట మండలం లింగన్నపేట నుంచి ప్రారంభమైంది. ముచ్చర్ల వద్ద కేంద్ర మంత్రి ఈ యాత్రలో పాల్గొన్నారు. తర్వాత ఆయన చీకోడులో విలేకరులతో మాట్లాడారు. కాజీపేటలో రైల్వేకోచ్‌ కర్మాగారానికి స్థలం చూపించకపోవడం వల్లే మంజూరు కాలేదన్నారు. తెలంగాణలో చేపడుతున్న రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధికి రైల్వే మంత్రిగా ఉన్న తనను ఈ ప్రభుత్వం నిధులు అడగలేదన్నారు. తెరాస అధికారంలోకి వచ్చి ఏడేళ్లవుతున్నా దళితులకు మూడెకరాల భూమి, నిరుపేదలకు రెండు పడక గదుల ఇళ్లు, లక్ష ఉద్యోగాలు, కేజీ టు పీజీ ఉచిత విద్య వంటి హామీలేవీ నెరవేర్చలేదన్నారు. 

భూసార పరీక్షలు ఫాంహౌస్‌కే పరిమితమా?: సంజయ్‌

ఈనాడు, హైదరాబాద్‌: యాసంగిలో వరి పంట వేయొద్దనడంతో రైతాంగం ఆందోళనలో ఉందని, ఆ ప్రకటనను ఉపసంహరించుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ సీఎం కేసీఆర్‌ను డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం భూసార పరీక్షల కోసం రూ.126 కోట్లు మంజూరు చేస్తే రాష్ట్రంలో ఒక్క గ్రామంలోనూ చేయలేదని, ఆ నిధులేమయ్యాయో స్పష్టం చేయాలన్నారు. రైతులందరికీ మేలు చేయాల్సింది పోయి, ఒక్క మీ ఫాంహౌస్‌లోనే భూసార పరీక్షలు చేశారని.. ఈ విషయంపై వివరణ ఇవ్వాలని కోరారు. ఈ మేరకు సంజయ్‌ శుక్రవారం సీఎంకు అయిదుపేజీల లేఖ రాశారు. ‘ప్రజాసంగ్రామయాత్రలో భాగంగా వేలాది మంది రైతులు వచ్చి సమస్యలు చెబుతున్నారు. 2018 నాటి ఎన్నికల హామీ రూ.లక్ష రుణమాఫీని అమలు చేయాలి. ప్రధానమంత్రి ఫసల్‌ బీమాకు రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లించకపోవడంతో అన్నదాతలకు రూ.960 కోట్ల పరిహారం అందట్లేదు. ధరణి పేరుతో భూములు లాక్కుంటున్నారని, పట్టాదారు పాసుపుస్తకాలివ్వట్లేదని రైతులు వాపోతున్నారు. 23 లక్షల ఎకరాల భూముల్ని నిషేధిత జాబితాలో చేర్చారు. దుర్వినియోగమవుతున్న ధరణి రైతులపాలిట యమపాశంగా మారింది. అక్రమాల్ని అరికట్టాలి’ అని లేఖలో సంజయ్‌ కోరారు. 2018-19లో 17,845 మంది, 2019-20లో 19,351 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇవి ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని