ఉద్యోగాలు భర్తీ చేయకుంటే మిలియన్‌ మార్చ్‌

ప్రధానాంశాలు

ఉద్యోగాలు భర్తీ చేయకుంటే మిలియన్‌ మార్చ్‌

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హెచ్చరిక

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల: ‘తెలంగాణ ఆవిర్భవించాక నిరుద్యోగం పెరిగింది. డిగ్రీలు, పీజీలు చేసినవారు కూలిపనులు, టీ దుకాణాలతో బతకాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి’ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పేర్కొన్నారు. ప్రజాసంగ్రామ యాత్ర శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ నుంచి తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లి వరకు సాగింది. అక్కడ ఏర్పాటు చేసిన సభలో సంజయ్‌తో పాటు కేంద్ర పశుసంవర్ధకశాఖ మంత్రి పురుషోత్తం రూపాలా, మాజీ ఎంపీ విజయశాంతి పాల్గొన్నారు. ఉద్యోగాల భర్తీకి దీపావళిలోగా ప్రభుత్వం ప్రకటన ఇవ్వకుంటే భాజపా ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతతో మిలియన్‌ మార్చ్‌ నిర్వహిస్తామని సంజయ్‌ హెచ్చరించారు. ఉపాధి కల్పన శాఖలో నమోదైన నిరుద్యోగులు 25 లక్షల మంది ఉన్నారని, ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆయా శాఖల్లో 1.91 లక్షలకు పైగా ఖాళీలున్నట్లు సమాచారం ఉందన్నారు. కేసీఆర్‌ దిల్లీకి వెళ్లి.. కోతలు కోస్తున్నారని విమర్శించారు. కేంద్ర మంత్రి రూపాలా మాట్లాడుతూ దేశమంతా నరేంద్ర మోదీని ఎలా అభిమానిస్తోందో... అదే స్థాయిలో రాష్ట్ర ప్రజలు బండి సంజయ్‌ని ఆశీర్వదించాలని కోరారు. తనకూ గతంలో పాదయాత్ర చేసిన అనుభవం ఉందన్నారు. ఎండనక, వాననక.. గ్రామాలు, పొలాల వెంట బండి సంజయ్‌ చేస్తున్న పాదయాత్రను చూస్తే గర్వంగా ఉందన్నారు.

‘బండి’ ముందుకు... ‘కారు’ వెనక్కి
విజయశాంతి మాట్లాడుతూ... ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి సంజయ్‌ బండి ముందుకు వెళుతుంటే.. కేసీఆర్‌ కారు వెనక్కిపోతోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని, ప్రజల హక్కుల రెక్కలను కేసీఆర్‌ విరిచేస్తున్నారని ఆరోపించారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాశ్‌ మాట్లాడుతూ నిరుద్యోగ భృతి ఇస్తామని మాట తప్పిన కేసీఆర్‌ ప్రతి నిరుద్యోగికి బకాయిపడ్డ రూ.లక్ష ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పాదయాత్ర ప్రముఖ్‌ మనోహర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

గచ్చిబౌలి స్టేడియం స్థలాలపై కుట్ర: రఘునందన్‌రావు
గన్‌ఫౌండ్రి, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన గచ్చిబౌలి స్టేడియంలోని అయిదెకరాలను ‘టిమ్స్‌’ ఆసుపత్రికి కేటాయిస్తూ పంచనామా చేయడం కుట్రపూరితమని భాజపా ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు అన్నారు. ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేసేందుకు ఇలా చేశారని ఆయన ఆరోపించారు. దీనిపై మంగళవారం నుంచి ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని వెల్లడించారు. శనివారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో 25 వేల ఎకరాల్లో క్రీడా గ్రామం నిర్మిస్తామని సీఎం కేసీఆర్‌, హకీంపేటలో 300 ఎకరాల్లో స్పోర్ట్స్‌ టవర్‌ నిర్మిస్తామన్న మంత్రి కేటీఆర్‌ వాటిని విస్మరించారన్నారు. సమావేశంలో మాజీ మంత్రి చంద్రశేఖర్‌, భాజపా రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ ఎస్‌.ప్రకాశ్‌రెడ్డి పాల్గొన్నారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని