రాహుల్‌ పగ్గాలు చేపట్టాలి

ప్రధానాంశాలు

రాహుల్‌ పగ్గాలు చేపట్టాలి

కాంగ్రెస్‌ పీఏసీ సమావేశంలో తీర్మానం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలవి ప్రజా వ్యతిరేక విధానాలు
నిరసనగా చేపట్టే కార్యక్రమాలు విజయవంతం చేయాలని పిలుపు

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో చేపట్టనున్న భారత్‌బంద్‌ సహా అన్ని ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేయాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ(ఏఐసీసీ) అధ్యక్ష బాధ్యతలు రాహుల్‌గాంధీ చేపట్టాలని తీర్మానం చేసింది. పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) సమావేశం శనివారం గాంధీభవన్‌లో జరిగింది. పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి, కమిటీ ఛైర్మన్‌ మాణికం ఠాగూర్‌, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి,  నేతలు షబ్బీర్‌అలీ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క తదితరులతో దాదాపు 5 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో అక్టోబరు 2 నుంచి డిసెంబరు 9 వరకు నిరుద్యోగ సమస్యపై చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చించారు. దళిత, గిరిజన ఆత్మగౌరవ సభల మాదిరిగానే బీసీ గర్జన ఏర్పాటు చేయాలని వి.హనుమంతరావు సూచించారు. హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిని త్వరలోనే ప్రకటించి ప్రచారం మొదలుపెట్టేలా చూడాలని నిర్ణయించారు. సమావేశం అనంతరం భట్టి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘27న భారత్‌బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నాం. అక్టోబరు 2 నుంచి నిరుద్యోగ సమస్యపై ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించాం. పోడు భూముల సమస్యపై ప్రతిపక్షాల ఆధ్వర్యంలో అక్టోబరు 5న అశ్వారావుపేట నుంచి ఆదిలాబాద్‌ వరకు చేపట్టనున్న పోడు రాస్తారోకోలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలి’’ అని భట్టివిక్రమార్క కోరారు. ఆదివారం జహీరాబాద్‌ పార్లమెంట్‌ సమీక్ష జరగనుంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని