ప్రతి ఊళ్లో శిథిల పాఠశాల భవనాలే

ప్రధానాంశాలు

ప్రతి ఊళ్లో శిథిల పాఠశాల భవనాలే

ధనిక రాష్ట్రమంటే ఇదేనా..?
ప్రజా సంగ్రామయాత్రలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

తంగళ్లపల్లి, న్యూస్‌టుడే: పాదయాత్రలో భాగంగా ఏ ఊరికి వెళ్లినా శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాలే కనిపిస్తున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. బడుల్లో బెంచీలు, ఫ్యాన్లు, విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేవని.. చివరకు చాక్‌పీసులకు సైతం డబ్బులు ఇవ్వడం లేదని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 30వ రోజు ప్రజా సంగ్రామయాత్రలో భాగంగా సంజయ్‌ ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి నుంచి రామన్నపల్లె, బస్వాపూర్‌ మీదుగా ఇల్లంతకుంట మండలం రామోజిపేట, పెద్దలింగాపూర్‌ వరకు పాదయాత్ర చేశారు. మధ్యమానేరు భూ నిర్వాసితులు కూడా పాదయాత్రలో పాల్గొని తమ సమస్యలపై పోరాటం చేయాలని సంజయ్‌కు వినతి పత్రం అందజేశారు. బస్వాపూర్‌లో చాకలి ఐలమ్మ చిత్రపటానికి ఎంపీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాయుధ పోరాటయోధురాలు చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ నియంత పాలనను తరిమికొట్టాలని మహిళలకు సంజయ్‌ పిలుపునిచ్చారు. పాదయ్రాతల్లో వివిధ చోట్ల ఆయన మాట్లాడుతూ.. పాఠశాలల్లో పని చేసే 12 వేల మంది విద్యా వాలంటీర్లతో పాటు 28 వేల మంది స్వచ్ఛ కార్మికులను రోడ్డున పడేశారని ఆరోపించారు. ఇదేనా ధనిక రాష్ట్రం అని ప్రశ్నించారు.  సంజయ్‌ వెంట పాదయాత్ర ప్రముఖ్‌ జి.మనోహర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ప్రేమేందర్‌రెడ్డి, ప్రదీప్‌కుమార్‌, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి కుమార్‌, నాయకులు రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్‌రెడ్డి, సీనీనటి కరాటే కళ్యాణి తదితరులు ఆదివారం నాటి పాదయాత్రలో పాల్గొన్నారు.  


ప్రతి బీసీ కుటుంబానికి రూ.10 లక్షలివ్వాలి

ఈనాడు, హైదరాబాద్‌: బీసీల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు.  వెనకబడిన వర్గాల సమస్యలపై సంజయ్‌ ఆదివారం సీఎం కేసీఆర్‌కు ఏడు పేజీల బహిరంగ లేఖను రాశారు. రాష్ట్ర జనాభాలో 50శాతానికి పైగా ఉన్న బీసీల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అర్హులైన ప్రతి బీసీ కుటుంబానికి రూ.10 లక్షల సాయం అందించి వారిలో మనోస్థైర్యం పెంచాలన్నారు. ప్రజా సంగ్రామయాత్రలో భాగంగా బీసీలు తనను కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలు వివరించారని, రాష్ట్రవ్యాప్తంగా బీసీ బంధు అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరినట్లు లేఖలో పేర్కొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని