పెంచి పెద్ద చేసిన కేసీఆర్‌పై విమర్శలా?

ప్రధానాంశాలు

పెంచి పెద్ద చేసిన కేసీఆర్‌పై విమర్శలా?

ఈటలపై మంత్రి హరీశ్‌ ధ్వజం

హుజూరాబాద్‌, జమ్మికుంట గ్రామీణం, న్యూస్‌టుడే: పెంచి పెద్దచేసిన కేసీఆర్‌పైన, పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్న తెరాస ప్రభుత్వంపైన విమర్శలు చేయడం ఈటల రాజేందర్‌కు తగదని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. చాకలి ఐలమ్మ జయంత్యుత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆదివారం అధికారికంగా కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి చౌరస్తాలో ఆమె విగ్రహాన్ని మంత్రులు గంగుల కమలాకర్‌, హరీశ్‌రావులు ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన రజక ఆత్మగౌరవ సభలో హరీశ్‌రావు మాట్లాడారు. ‘‘ముఖ్యమంత్రి కేసీఆర్‌ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాననే విషయాన్ని మాజీ మంత్రి గుర్తుంచుకోవాలి. దిల్లీలో పలుకుబడి ఉంటే తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, హుజూరాబాద్‌కు రూ.2 వేల కోట్ల ప్యాకేజీ తీసుకురావాలి. భాజపా ద్వారా ప్రజలకు ఏం చేస్తారో చెప్పి ఓట్లు అడగాలి’’ అని వ్యాఖ్యానించారు. అంతకుముందు హుజూరాబాద్‌ ప్రభుత్వాసుపత్రి కూడలిలో మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి చాకలి ఐలమ్మ, మొల్లమాంబ విగ్రహాలను హరీశ్‌రావు ఆవిష్కరించారు. వరంగల్‌, నల్గొండ, సిద్దిపేట, హుజూరాబాద్‌లో చాకలి ఐలమ్మ భవనాలను నిర్మిస్తామని వెల్లడించారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, తెలంగాణ సాంస్కృతిక సారథి ఛైర్మన్‌ రసమయి బాలకిషన్‌, బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, ఎంబీసీ, ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్లు తాడూరి శ్రీనివాస్‌, బండ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

సీఎం కాళ్లు మొక్కయినా 5 వేల ఇళ్లు కట్టిస్తా

కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో ఏర్పాటు చేసిన కుమ్మరి కులస్థుల ఆశీర్వాద సభలో హరీశ్‌ మాట్లాడుతూ ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను గెలిపిస్తే సీఎం కేసీఆర్‌ కాళ్లు మొక్కయినా పేదల కోసం 5 వేల ఇళ్లు కట్టిస్తానన్నారు. తెలంగాణలో అన్నివర్గాల వారికి ఉన్న సౌకర్యాలు భాజపా పాలిత రాష్ట్రాల్లో ఉంటే తాను ముక్కు నేలకు రాస్తానని ఆయన సవాల్‌ విసిరారు. హుజూరాబాద్‌లో నియోజకవర్గస్థాయి వీఆర్‌ఏలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భాజపా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దళితులకు రూ.లక్ష ఇచ్చారా అని ప్రశ్నించారు.


ధాన్యం సంగతి తేల్చేందుకు దిల్లీకి కేసీఆర్‌

నంగునూరు, న్యూస్‌టుడే: యాసంగిలో పండే దొడ్డు రకం వడ్లను కొనబోమని కేంద్రం చెప్పడంతో.. ఆ సంగతి తేల్చుకునేందుకు సీఎం కేసీఆర్‌ దిల్లీ వెళ్లారని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఆదివారం ఆయన సిద్దిపేట జిల్లా నంగునూరు మండల పరిధి పాలమాకులలో కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు, ఇటీవల వర్షాలకు ఇళ్లు దెబ్బతిన్న వారికి పరిహారం పంపిణీ చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని