ఒక్క శాతం ముస్లింలకైనా రూ.10 లక్షల సాయం అందించాలి

ప్రధానాంశాలు

ఒక్క శాతం ముస్లింలకైనా రూ.10 లక్షల సాయం అందించాలి

సర్కారుకు ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ వినతి

నాంపల్లి, న్యూస్‌టుడే: తెలంగాణలోని ముస్లింలలో పేదరికం పెరిగిపోతోందని ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 8.80 లక్షల ముస్లిం కుటుంబాలుండగా.. వారిలో 2 శాతం మంది దుర్భర జీవితాలు గడుపుతున్నారన్నారు. అందులో కనీసం ఒక్క శాతం కుటుంబాలకైనా రూ.10 లక్షల వంతున ఆర్థికసాయం అందజేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని ముస్లింల స్థితిగతులపై సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ పాలసీ అండ్‌ ప్రాక్టీస్‌(సీడీపీపీ) సంస్థతో ఎంఐఎం పార్టీ సర్వే చేయించింది. ఈ నేపథ్యంలో సోమవారం నాంపల్లిలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ‘తెలంగాణలో ముస్లింలు- పేదరికం- సవాళ్లు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఎంపీ అసదుద్దీన్‌ కీలకోపన్యాసం చేస్తూ.. రాష్ట్రంలో సొంతిల్లున్న ముస్లింలు కేవలం 57 శాతం మందే ఉన్నారన్నారు. అక్షరాస్యత రేటు ప్రాథమిక విద్యాస్థాయిలో 77 శాతంగా ఉందని, 10- 15 ఏళ్ల వయసు పిల్లలను పాఠశాలలకు పంపడం లేదని చెప్పారు. ఇంటర్‌ వరకు 24 శాతం, డిగ్రీకి వచ్చేసరికి 19 శాతం మందే ఉంటున్నట్లు వివరించారు. దళితబంధులాంటి పథకాన్ని ముస్లింలకు కూడా వర్తింపజేస్తే మేలు జరుగుతుందన్నారు. ఈ అంశంపై త్వరలోనే సీఎం కేసీఆర్‌ను కలిసి నివేదిక సమర్పిస్తానని ఒవైసీ తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని