మా విజయాన్ని ఎవరూ ఆపలేరు

ప్రధానాంశాలు

మా విజయాన్ని ఎవరూ ఆపలేరు

హుజూరాబాద్‌లో.. తెరాస డిపాజిట్‌కు వెంపర్లాడాల్సిందే: బండి సంజయ్‌

ఈనాడు డిజిటల్‌, సిద్దిపేట: హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో డిపాజిట్‌ కోసం తెరాస వెంపర్లాడాల్సిందేనని, తమ పార్టీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ధీమా వ్యక్తం చేశారు. ఆయన చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర మంగళవారం ఉదయం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కల్లెపల్లిలో ప్రారంభమై... గాగిల్లాపూర్‌ వరకు కొనసాగింది. భారీ వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న, వరి పంటలను సంజయ్‌ పరిశీలించి, రైతుల సమస్యలను తెలుసుకున్నారు. బెజ్జంకిలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. ధాన్యం కొనుగోలు చేయలేమంటూ కేంద్రం ఎప్పుడూ చెప్పలేదని, రైతులను భయపెట్టేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ అలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. పంటల మార్కెటింగ్‌పై అన్ని రాష్ట్రాల సీఎంలతో కేంద్రం సమావేశం నిర్వహిస్తే, కేసీఆర్‌ ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు. కిసాన్‌ మోర్చా జాతీయ అధ్యక్షులు రాజ్‌కుమార్‌ చాహర్‌, ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు, కిసాన్‌ మోర్చా జాతీయ ఉపాధ్యక్షుడు సురేశ్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొహెడ మండలం రామచంద్రాపూర్‌లో బండి సంజయ్‌ రాత్రి బస చేశారు. ఆయన భార్య అపర్ణ, ఇతర కుటుంబ సభ్యులు అక్కడకు వచ్చి ఆయనను కలిశారు.


మీ ఆస్తులపై చర్చకు సిద్ధమా?

ఈనాడు, హైదరాబాద్‌: బంగారు తెలంగాణ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన కుటుంబాన్ని, బంధువుల్ని, పార్టీనే బంగారుమయం చేశారని  బండి సంజయ్‌ విమర్శించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టే నాటికి మీకు, మీ కుటుంబ సభ్యులకున్న ఆస్తులు ఎన్ని? ఇప్పుడెన్ని? అనే దానిపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాలు విసిరారు. మీ ఆస్తులు లక్ష రెట్లు పెరిగింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. 10 అంశాలతో సీఎం కేసీఆర్‌కు సంజయ్‌ మంగళవారం బహిరంగ లేఖ రాశారు. ‘‘దేశంలో అత్యంత అవినీతిపరుడు, ధనవంతుడు కేసీఆర్‌ అని పేరుంది. కాళేశ్వరం అంచనాలు పెంచి ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. మీ కుటుంబసభ్యులు, పార్టీ నేతలు, బంధువుల దందాలపై  దర్యాప్తు జరిపించి అవినీతి జరగలేదని నిరూపించుకోగలరా?’’ అని లేఖలో సంజయ్‌ ప్రశ్నించారు. సాగునీరు, విద్యుత్తు ప్రాజెక్టులు, మిషన్‌ భగీరథ, కాకతీయ నిర్మాణాలు, ప్రభుత్వ భూముల అమ్మకాల పత్రాలను అఖిలపక్షం ముందుంచి చర్చకు రావాలని డిమాండ్‌ చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని