ప్రగతి చూసి ఓర్వలేక కాంగ్రెస్‌ విమర్శలు

ప్రధానాంశాలు

ప్రగతి చూసి ఓర్వలేక కాంగ్రెస్‌ విమర్శలు

తెలంగాణలోనే అత్యధిక ఉద్యోగ నియామకాలు
మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లా పచ్చగా మారుతుంటే కాంగ్రెస్‌ నేతలకు కళ్లు మండుతున్నాయని మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్‌ ధ్వజమెత్తారు. రాష్ట్రం ఈ ఏడేళ్లలో సాధించిన ప్రగతిని చూసి ఓర్వలేకపోతున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితులతో తమకు పుట్టగతులుండవనే ఈర్ష్య, అసూయలతో అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు, అర్హత కాంగ్రెస్‌ లేదన్నారు. తెదేపాలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ కారణంగానే పాలమూరు నాశనమైందని విమర్శించిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు తెరాసపై అసత్యాలు చెప్పడం సిగ్గు చేటని ఆక్షేపించారు. బుధవారం ఎంపీ పి.రాములు, విప్‌ గువ్వల బాలరాజుతో కలిసి వారు విలేకరులతో మాట్లాడారు. తెరాస ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పాలమూరులో ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయిందని, పాలమూరు-రంగారెడ్డి పథకాన్ని రెండేళ్లలో పూర్తి చేసి నీళ్లందిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వరంగంలో 1.52 లక్షల ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్‌ వెలువరించి, 1.33 లక్షల పోస్టులు భర్తీ చేయడమేకాక ప్రైవేటు రంగంలో 15 లక్షలమందికి ఉద్యోగాలిప్పించిన ఘనత తెరాస ప్రభుత్వానిదేనని తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు కొత్తగా మూడు వైద్యకళాశాలలు మంజూరు చేశామని వివరించారు. 80 వేల ఉద్యోగాలు ఇస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారని, దీంతోపాటు ఏటా ఉద్యోగాలపై క్యాలెండర్‌ విడుదల చేస్తామన్నారని తెలిపారు. కాంగ్రెస్‌ నిర్వాకం వల్ల ప్రాణత్యాగం చేసిన తెలంగాణ ఉద్యమకారుడు శ్రీకాంతాచారి ఫొటో పెట్టుకుని రేవంత్‌ నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘పాలమూరు వెనకబాటుతనానికి కాంగ్రెసే కారణం. ఏపీలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ప్రాజెక్టులను ఆ రాష్ట్ర ప్రజలు, పార్టీలు అడ్డుకోవడం లేదు. తెలంగాణలోని భాజపా, కాంగ్రెస్‌ పార్టీలు ఈ పాపం మూటకట్టుకుంటున్నాయి’’ అని నిరంజన్‌రెడ్డి అన్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ ‘‘తెలంగాణలో నిరుద్యోగాన్ని పెంచి పోషించింది తెదేపా, కాంగ్రెస్‌లే.. చంద్రబాబు ఉద్యోగ నియామకాలను రద్దు చేస్తే కాంగ్రెస్‌ అదే దోవన నడిచింది’’ అని పేర్కొన్నారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని