ముమ్మాటికీ తెరాసదే గెలుపు

ప్రధానాంశాలు

ముమ్మాటికీ తెరాసదే గెలుపు

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

ఈనాడు, హైదరాబాద్‌: హుజూరాబాద్‌ ఉపఎన్నికలో ముమ్మాటికీ తెరాసే గెలుస్తుందని,  ఈటల రాజేందర్‌ ఓటమి ఖాయమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. హుజూరాబాద్‌ ఉపఎన్నికల్లో ప్రత్యేకత ఏమీలేదని, ఇదీ అన్ని ఎన్నికల లాంటిదేనన్నారు. ఇక్కడా నాగార్జునసాగర్‌ ఫలితం పునరావృతమవుతుందని తెలిపారు. తెరాసలో చేరి, ఇందులోనే పెరిగి అదే పార్టీని శాపనార్థాలు పెట్టిన వాళ్లెవరూ బాగుపడలేదని, ఈటల పరిస్థితి కూడా అలాగే ఉండబోతోందన్నారు. అసలు ఉపఎన్నిక ఎందుకు వచ్చిందో ఈటల చెప్పాలన్నారు. గురువారం ఆమె హైదరాబాద్‌లోని తమ నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘తెరాసకు భాజపా పోటీయే కాదు. రైతుబంధు లాంటి పథకాలను తెరాస తీసుకొస్తే, చట్టాలను మార్చి భాజపా రైతులను ఇబ్బంది పెడుతోంది. ఆడబిడ్డల కోసం కేసీఆర్‌ అనేక కార్యక్రమాలు రూపొందిస్తుంటే, కేంద్రం గ్యాస్‌ ధరలు పెంచి వారిపై బరువు మోపుతోంది.  తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దార్శనికుడు సీఎం కేసీఆర్‌. ప్రతి రంగంలో స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ప్రగతి సాధిస్తున్నారు. రెండు దశాబ్దాల తెరాస ప్రస్థానం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినది. వరంగల్‌లో తలపెట్టిన విజయగర్జన సభను విజయవంతం చేయాలి. మాటలు చెప్పడం తప్ప భాజపా పనిచేసిన సందర్భాలు లేవు. కరోనా సమయంలో రూ.20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కానీ సామాన్య ప్రజలకు కనీసం రూ. 20 లబ్ధికూడా జరగలేదు.ఆ కష్టకాలంలోనూ తెరాస ప్రభుత్వం ఒక్క పథకాన్ని కూడా ఆపలేదు. జీతాలు, పెన్షన్లు, రైతుబంధు లాంటి ప్రతి కార్యక్రమాన్ని నిరాటంకంగా నిర్వహించింది.’’ అని కవిత తెలిపారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని