యూపీలో మహిళలకు 40% టికెట్లు

ప్రధానాంశాలు

యూపీలో మహిళలకు 40% టికెట్లు

ప్రియాంకాగాంధీ

ఈనాడు, లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం పెంచేందుకుగాను 2022 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున వారికి 40 శాతం టికెట్లు కేటాయిస్తామని ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ప్రకటించారు. మంగళవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ.. హాథ్రస్‌ మొదలుకొని లఖింపుర్‌ ఖేరి సంఘటన వరకు రాష్ట్రంలో జరిగిన అనేక అరాచక, హింసాత్మక సంఘటనల్లో బాధిత కుటుంబాల్లోని మహిళలను తాను స్వయంగా కలిసి వారి గోడు విన్నట్లు ఆమె తెలిపారు. స్త్రీలు కేవలం అబలలుగా మిగలకుండా శక్తిమంతులుగా తయారుకావాలంటే రాజకీయాల్లో కీలకంగా రాణించాలన్నారు. ఈ ఉద్దేశంతోనే కాంగ్రెస్‌ తరఫున వారికి 40 శాతం టికెట్లు ఇవ్వబోతున్నట్లు వివరించారు. ఇప్పటివరకు ఏ పార్టీ కూడా ఇంత పెద్దఎత్తున మహిళలకు ప్రాతినిధ్యం ఇవ్వలేదని, కాంగ్రెస్‌ పార్టీ ఈ సాహస నిర్ణయం తీసుకుందన్నారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేసే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ముఖ్యమంత్రిగానూ మహిళా అభ్యర్థినే ప్రకటిస్తారా? అనే ప్రశ్నకు ‘తర్వాత చెబుతా’నంటూ జవాబు దాటవేశారు. పార్టీ కార్యాలయం బయట ఏర్పాటుచేసిన భారీ తెరపై ఈ ప్రెస్‌మీట్‌ను చూస్తున్న కాంగ్రెస్‌ మహిళా కార్యకర్తలు ప్రియాంక నోట పార్టీ నిర్ణయం గురించి వినగానే.. పెద్దఎత్తున బాణసంచా కాల్చి, నినాదాలు చేశారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని