దళితబంధును అడ్డుకుంది భాజపా, తెరాసలే

ప్రధానాంశాలు

దళితబంధును అడ్డుకుంది భాజపా, తెరాసలే

ఆపొద్దని కిషన్‌రెడ్డి, బండి కోరలేదెందుకు?
వర్గీకరణకు సీఎం అఖిలపక్షాన్ని ఎందుకు తీసుకెళ్లలేదు?
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

బన్సీలాల్‌పేట్‌, చార్మినార్‌, న్యూస్‌టుడే: దళితబంధు పథకాన్ని భాజపా, తెరాసలు వ్యూహాత్మకంగానే నిలిపేశాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నికల కోడ్‌కు ముందే అమలైన పథకాన్ని కొనసాగించాలని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌లు కేంద్ర ఎన్నికల అధికారిని ఎందుకు కోరలేదని ప్రశ్నించారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఉల్లంఘనలపై మంగళవారం ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్‌గోయల్‌కు ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్సీల వర్గీకరణ కోసం అఖిలపక్షాన్ని దిల్లీకి తీసుకెళ్తానని అసెంబ్లీలో ప్రకటించిన సీఎం కేసీఆర్‌.. ఇప్పటివరకు ఎందుకు తీసుకెళ్లలేదని ప్రశ్నించారు.  కేటీఆర్‌ అన్నివిధాలా తనకంటే జూనియర్‌ అని, ఆయనతో ఏ విషయంలోనైనా చర్చకు సిద్ధమని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. నవంబరు 15 లోగా చర్చకు రావాలని సవాలు విసిరారు.

నిలదీస్తారనే నిరుద్యోగులపై దాడులు

విద్యార్థులు, నిరుద్యోగ ఓటర్లు.. ఉద్యోగాలు, నిరుద్యోగ భృతిపై నిలదీస్తే ప్రచారం సాగించలేమనే ఉద్దేశంతోనే హుజూరాబాద్‌లో తెరాస శ్రేణులు దాడులకు పాల్పడుతున్నాయని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వీణవంకలో ఇటీవల నిరుద్యోగ యువతి నిరోషాపై తెరాస శ్రేణులు దాడి చేశారని, పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారని అన్నారు. ఈ అంశంపై ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్‌గోయల్‌కు ఫిర్యాదు చేయగా నివేదిక తెప్పించుకొని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు.

దేశ సమగ్రత, సమైక్యత కోసం మహాత్మాగాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్‌గాంధీలు ప్రాణాలర్పించారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం చార్మినార్‌ వద్ద పీసీసీ ఆధ్వర్యంలో రాజీవ్‌గాంధీ సద్భావన యాత్ర స్మారక దినోత్సవాన్ని నిర్వహించారు. రాష్ట కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌, యాత్ర స్మారక కమిటీ ఛైర్మన్‌ జి.నిరంజన్‌ తదితరులతో కలిసి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి వీరప్పమొయిలీకి రాజీవ్‌గాంధీ సద్భావన అవార్డు ప్రదానం చేశారు.

రాజీవ్‌ పాలన స్వర్ణయుగం: మొయిలీ

రాజీవ్‌ పాలన స్వర్ణయుగమని వీరప్పమొయిలీ ఈ సందర్భంగా అన్నారు. 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించి యువతకు ప్రాధాన్యం ఇచ్చారన్నారు. అవినీతిని నిరోధించేందుకు యూపీఏ పాలనలో లోక్‌పాల్‌ బిల్లు తీసుకువస్తే దాని అమలులో మోదీ ప్రభుత్వం విఫలమైందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలో కాంగ్రెస్‌లో అధికారంలోకి వస్తుందన్నారు. ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. అన్ని కులాలు, మతాలు కలిసి ఉండాలని కాంగ్రెస్‌ కోరుకుంటుందన్నారు. కార్యక్రమంలో ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌, రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు గీతారెడ్డి, మధుయాస్కీ, షబ్బీర్‌ అలీ, వంశీచంద్‌రెడ్డి, వి.హనుమంతరావు, మర్రి శశిధర్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, దామోదర్‌రెడ్డి, యువజన కాంగ్రెస్‌ నాయకులు అనిల్‌కుమార్‌ యాదవ్‌, అమేర్‌జావిద్‌ తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మదీనా హోటల్‌లో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో వీరప్పమొయిలీ సహా కీలక నాయకులకు విందు ఏర్పాటు చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని