హుజూరాబాద్‌లో మా అభ్యర్థి, కార్యకర్తలకు ప్రాణహాని

ప్రధానాంశాలు

హుజూరాబాద్‌లో మా అభ్యర్థి, కార్యకర్తలకు ప్రాణహాని

ఈసీకి భాజపా ఫిర్యాదు

ఈనాడు, దిల్లీ: హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్‌, కార్యకర్తలకు పోలీసుల నుంచి ప్రాణహాని ఉందని భారత ఎన్నికల సంఘానికి (ఈసీఐ) భాజపా తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి బృందం ఫిర్యాదు చేసింది. భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, మహిళామోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి, బంగారు శ్రుతి, జయశ్రీ తదితరులు బుధవారం దిల్లీలో ఎన్నికల కమిషనర్లు రాజీవ్‌కుమార్‌, అనూప్‌చంద్ర పాండేలను కలిసి వినతిపత్రం అందజేశారు. భాజపా తరఫున ప్రచారం చేస్తే తీవ్ర పరిణామాలుంటాయంటూ... సీఐ, ఇతర పోలీసులు కార్యకర్తలను వేధిస్తున్నారని ఆరోపించారు. దళితబంధుకు నిధులు కేటాయించినట్లు చెప్పిన అధికారులు, వాటిని పంచకుండా నిలిపివేశారని పేర్కొన్నారు. ఇందుకు బాధ్యులుగా జిల్లా కలెక్టర్‌ను, పక్షపాతంతో వ్యవహరిస్తున్న పోలీస్‌ కమిషనర్‌, రిటర్నింగ్‌ అధికారి, ఇతర అధికారులను బదిలీ చేయాలని కోరారు. దళితబంధు నిలిపివేతకు భాజపా కారణమంటూ అధికార పార్టీ అసత్య ప్రచారం చేస్తోందని ఆరోపించారు. తెరాస నాయకులు ఓటర్లకు డిజిటల్‌ రూపంలో డబ్బు చెల్లిస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో కేంద్ర బలగాలను మోహరించాలని, ప్రత్యేక పరిశీలకుడిని నియమించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని