భాజపా లేఖ వల్లే దళితబంధు ఆగింది

ప్రధానాంశాలు

భాజపా లేఖ వల్లే దళితబంధు ఆగింది

ఆర్థిక మంత్రి హరీశ్‌రావు

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌: భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి లేఖ రాయడం వల్లే పదిరోజులపాటు దళితబంధు ఆగిందని రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో ఆయన ప్రచార కార్యక్రమంలో మాట్లాడారు. దళితబంధు అమలు నిలిపివేతపై తాను సవాలు విసిరితే ఏ ఒక్క భాజపా నాయకుడూ రాలేదన్నారు. అయిదేళ్లకు రావాల్సిన ఎన్నికలు ఈటల రాజేందర్‌ స్వార్థం వల్ల మధ్యలో వచ్చాయన్నారు. నిత్యావసర ధరలను భాజపా విపరీతంగా పెంచడంతోపాటు ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను ఊడగొడుతూ.. ప్రభుత్వ ఆస్తులను అమ్ముతోందని ఆరోపించారు. భాజపా అభ్యర్థిగా ఉన్న రాజేందర్‌ ప్రజలకు ఏం చేస్తారో చెప్పడం లేదని ఎద్దేవా చేశారు. ఆయన హయాంలో హుజూరాబాద్‌ నియోజకవర్గంలో అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు.


కులవృత్తులకు ప్రోత్సాహం: తలసాని

హుజూరాబాద్‌ పట్టణం, గ్రామీణం, న్యూస్‌టుడే:కుల వృత్తులను ప్రోత్సహించేది తెరాస ప్రభుత్వమేనని రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. బుధవారం హుజూరాబాద్‌లోని తెరాస కార్యాలయంలో గొల్ల కురుమ, మత్స్య కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వాలు కుల వృత్తులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. గొల్ల, కురుమలకు రూ.11 వేల కోట్లతో గొర్రెలను అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 40లక్షల మంది మత్స్యకార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఉచితంగా రొయ్యలు, చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. ఈటల తన తప్పిదాలను కప్పి పుచ్చుకోవటం కోసమే రాష్ట్ర ప్రభుత్వంపై అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారన్నారు. కరీంనగర్‌ ఎంపీగా గెలిచిన బండి సంజయ్‌కుమార్‌ కేంద్రం నుంచి ఎన్ని నిధులు తీసుకొచ్చారో చెప్పాలన్నారు. కార్యక్రమంలో  మంత్రి గంగుల కమలాకర్‌, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్‌, బండ ప్రకాష్‌, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, ఎమ్మెల్యేలు జైపాల్‌ యాదవ్‌, నోముల భగత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని