కేసీఆర్‌.. ఆధారాలతో యాదాద్రి రండి

ప్రధానాంశాలు

కేసీఆర్‌.. ఆధారాలతో యాదాద్రి రండి

దళితబంధు భాజపా వల్లే ఆగిందని నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా
లేదంటే మీరు పదవిని వదలండి
సీఎంకు బండి సంజయ్‌ సవాల్‌

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌: హుజూరాబాద్‌లో దళితబంధు పథకం నిలిచిపోవడానికి భాజపా కారణమని నిరూపిస్తే తాను తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రకటించారు. రుజువు చేయలేకపోతే ముఖ్యమంత్రి కేసీఆర్‌ సీఎం పీఠాన్ని వదిలిపెట్టాలని సవాలు విసిరారు. పథకాన్ని నిలిపివేయాలంటూ భాజపా లేఖ రాసిందని ఆరోపిస్తున్న సీఎం ఆ ఆధారాలతో యదాద్రికి వచ్చి అక్కడ ప్రమాణం చేయాలని డిమాండ్‌ చేశారు. ఇందుకు తేదీ ఖరారు చేస్తే తన ఇష్టదైవం లక్ష్మీనరసింహస్వామి కొలువైన గుట్టకు తానూ వస్తానని స్పష్టం చేశారు. హుజూరాబాద్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం 8 గ్రామాల్లో ఆయన రోడ్‌షోలను నిర్వహించి తెరాసపై విమర్శలు కురిపించారు. ఇక్కడి ఎన్నికల్లో తెరాస ఓడిపోతోందనే భయంతోనే దళితుల ఖాతాల్లోని డబ్బును నిలుపు(ఫ్రీజ్‌) చేయించి.. దళితబంధు రాకుండా కేసీఆర్‌ కుట్రలు చేశారని ఆరోపించారు. ఉప ఎన్నిక తరువాతా కోర్టులో కేసు వేయించి ఆ పథకాన్ని నిలిపేసేటందుకు ముఖ్యమంత్రి ప్రయత్నాలు చేస్తారని జోస్యం చెప్పారు. హుజూరాబాద్‌లో భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ గెలుపు ఖాయమని సంజయ్‌ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే రాజాసింగ్‌(ఆర్‌), రఘునందన్‌రావు(ఆర్‌)లు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో అడుగుపెట్టగా..ఫలితాలు వెలువడే నవంబరు 2న  రాజేందర్‌(ఆర్‌) గెలుపుతో కేసీఆర్‌కు ప్రగతిభవన్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా కనిపిస్తుందన్నారు.


భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ బుధవారం కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలంలోని పలు గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సైదాబాద్‌లో ప్రచారం ముగించుకుని విలాసాగర్‌ వెళ్తూ వెంకటేశ్వర్లపల్లి దళిత కాలనీకి చెందిన పుల్లూరి రవి ఇంట్లో భోజనం చేశారు.

-న్యూస్‌టుడే, జమ్మికుంట గ్రామీణం


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని