విజయగర్జనకు ఊరూరూ కదలాలి

ప్రధానాంశాలు

విజయగర్జనకు ఊరూరూ కదలాలి

ఇంటికొకరు రావాలి
నియోజకవర్గాల సమీక్షలో మంత్రి కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి ద్విదశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వచ్చే నెల 15న వరంగల్‌లో జరిగే తెరాస విజయగర్జనకు ఊరూరూ కదలాలని, ఇంటికొకరు తరలి రావాలని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు. విజయగర్జన, ఈ నెల 25న జరిగే పార్టీ ప్లీనరీల సన్నాహాల్లో భాగంగా మూడోరోజు ఆయన మేడ్చల్‌, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలకు చెందిన 20 నియోజకవర్గాల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘తెరాస పండగంటే రాష్ట్ర ప్రజల పండగే. సీఎం కేసీఆర్‌ మార్గనిర్దేశంలో దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా మారింది. తెలంగాణ ఉద్యమ సందర్భంగా చేసిన కార్యక్రమాలను, త్యాగాలను మరోసారి మననం చేసుకుంటూ పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాల కోసం పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పనిచేయాలి. ప్రజలు, కార్యకర్తలు భారీగా వస్తున్నందున ఏర్పాట్లను స్థానిక మంత్రులు సమన్వయం చేసుకోవాలి. హెచ్‌ఐసీసీలో ఈ నెల 25న జరిగే పార్టీ ప్లీనరీ ఘనంగా నిర్వహిస్తున్నాం. దీనికి ఏర్పాట్లు పూర్తయ్యాయి’’ అని కేటీఆర్‌ తెలిపారు.

8 వేల మంది అతిథులకు భోజనం

హైదరాబాద్‌లో జరిగే ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధులకు నోరూరించే వంటకాలు సిద్ధం కానున్నాయి. ఆహారకమిటీ ఇన్‌ఛార్జి మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో ఈసారి 500 మంది నిపుణులు 29 రకాల వంటలను వండనున్నారు. దీనికి సంబంధించిన జాబితాను కేటీఆర్‌ ఆమోదించారు. ఒకేసారి 8 వేల మంది అతిథులు భోజనం చేసేలా ఏర్పాట్లుంటాయని,  వీవీఐపీలతో పాటు ప్రజాప్రతినిధులు, మహిళలకు వేర్వేరుగా భోజనశాలలను సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ సమావేశాల్లో మంత్రులు సబితారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌, పార్టీ సెక్రటరీ జనరల్‌ కె.కేశవరావు, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని