రాజన్న పాలన తీసుకొస్తా

ప్రధానాంశాలు

రాజన్న పాలన తీసుకొస్తా

నేను వైఎస్‌ బిడ్డను.. మాది వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ
ప్రజాప్రస్థానం పాదయాత్రలో వైతెపా అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యలు

మొయినాబాద్‌, న్యూస్‌టుడే: ‘‘రాజన్న పాలనను తీసుకొస్తానని మాటిస్తున్నా.. ఇచ్చిన మాట నిలబెట్టుకొని తీరుతా.. మడమ తిప్పేది లేదు’’ అని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రజలకు హామీ ఇచ్చారు. చేవెళ్ల నుంచి ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర రెండో రోజు గురువారం మొయినాబాద్‌ మండలంలో సాగింది. బుధవారం రాత్రి చేవెళ్ల మండలం కందవాడలో బస చేసిన ఆమె గురువారం ఉదయం పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. 10 గంటలకు పాదయాత్ర ప్రారంభించారు. దారి పొడవునా ప్రజల యోగక్షేమాలను అడుగుతూ ముందుకు సాగారు. ‘ఏం పెద్దయ్య ఎలా ఉన్నావు.. పెద్దమ్మ బాగున్నావా.. నేను మీ రాజన్న బిడ్డను.. తిరిగి నాన్న పాలనను తీసుకొస్తా. మీ అందరి ఆదరణ కావాలి’’ అని కోరారు. అన్నదాతల దగ్గరకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమది కాంగ్రెస్‌ పార్టీ కాదని, తాను రాజన్న కూతురునని, తమది వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అని ప్రజలకు వివరించారు. తెలంగాణలో సాగుతున్న కుటుంబ పాలనకు అంతం పలికేందుకే పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. మొయినాబాద్‌ మండలం నక్కలపల్లి, కేతిరెడ్డిపల్లి, చాకలిగూడ, వెంకటాపూర్‌ గ్రామాల మీదుగా సాగిన పాదయాత్రలో షర్మిలకు స్థానికులు సమస్యలను ఏకరువు పెట్టారు. ‘‘రూపాయికి కిలో బియ్యం ఇస్తున్నా అంటున్న సీఎం కేసీఆర్‌.. రూ.10 ఉన్న సబ్బు ధరను రూ.30లకు పెంచారు. కొత్తగా ఎవరికీ పింఛన్లు ఇవ్వడం లేదు. వైఎస్సార్‌ సీఎంగా ఉన్న సమయంలో అర్హులైన పేదలందరికీ పింఛన్లు ఇచ్చేవారు. పంట రుణాలను మాఫీ చేస్తామని ఇచ్చిన హామీని కేసీఆర్‌ నిలబెట్టుకోలేదు. కరోనాతో అల్లాడిపోతే కనీసం పట్టించుకొనే దిక్కు లేకుండా పోయింది. ప్రైవేటు ఆసుపత్రులకు వెళితే రూ.లక్షలు తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా.. చెల్లదని బయటకు గెంటేశారు’’ అంటూ పలువురు షర్మిలకు వివరించారు.

పేదలందరికీ ఇళ్లు కట్టిస్తా..
కేసీఆర్‌ పాలనలో పూర్తిగా ఉన్నోళ్లకే పంచి పెడుతున్నారని పలువురు రైతులు, మహిళలు వైఎస్‌ షర్మిల దృష్టికి తీసుకొచ్చారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు జరగడం లేదని.. రెండు పడకగదుల ఇళ్లు ఇస్తామని ఇచ్చిన హామీ సైతం అమలుకు నోచుకోవడం లేదని వాపోయారు. ప్రజా సమస్యలు ప్రత్యక్షంగా చూసేందుకే పాదయాత్ర చేపట్టానని.. అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలందరికీ ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. వైతెపా నేతలు కొండా రాఘవరెడ్డి, డేవిడ్‌ తదితరులు పాదయాత్రలో పాల్గొన్నారు.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని