తెరాస, భాజపాల తీరును ఎండగట్టండి

ప్రధానాంశాలు

తెరాస, భాజపాల తీరును ఎండగట్టండి

హుజూరాబాద్‌ ఎన్నికపై ముఖ్య నేతలతో రేవంత్‌రెడ్డి

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: తెరాస, భాజపాల చీకటి రాజకీయాలను, లోపాయికారి ఒప్పందాలను బయటపెట్టాలని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆ రెండు పార్టీల మోసపూరిత విధానాలను ఎండగడుతూ విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. జూమ్‌ యాప్‌ ద్వారా ఆయన గురువారం హుజూరాబాద్‌ ఉపఎన్నికల ఇన్‌ఛార్జీలు, సమన్వయకర్తలతో సమావేశమయ్యారు. కాంగ్రెస్‌ నేతలు దామోదర రాజనర్సింహా, జగ్గారెడ్డి, మల్లు రవి, పొన్నం ప్రభాకర్‌, హర్క వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఈ ఉపఎన్నికకు కారణం ఎవరు? దళిత బంధును అడ్డుకున్నదెవరు? అనే అంశాలను ప్రజల్లోకి లోతుగా తీసుకువెళ్లాలన్నారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత, కొత్త ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచారం చేయాలన్నారు.‘ఇంటికో ఓటు కాంగ్రెస్‌కు’ అనే నినాదాన్ని ప్రతి ఇంటికీ తీసుకువెళ్లాలని సూచించారు. ప్రజలు కాంగ్రెస్‌ వైపు నిలబడేలా వ్యూహాలు అమలు చేయాలన్నారు.

రేపటి నుంచి రేవంత్‌ ప్రచారం
పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి ఈనెల 23, 24, 26 తేదీల్లో హుజూరాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఆయన ఈ ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఇదే మొదటిసారి. కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌కు మద్దతుగా ఆ పార్టీ ముఖ్య నేతలు ఇప్పటికే నియోజకవర్గంలో ప్రచారంలో నిమగ్నమయ్యారు.

అవినీతి తగ్గిందనడం హాస్యాస్పదం: వీహెచ్‌
దేశంలో అవినీతి తగ్గిందని ప్రధాని మోదీ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు విమర్శించారు. అవినీతిపరులను దేశం దాటించిన చరిత్ర మోదీదని ఆరోపించారు. ఆయన గురువారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రధానికి చిత్తశుద్ధి ఉంటే విదేశాలకు పారిపోయిన వారిని రప్పించి శిక్షించాలని వీహెచ్‌ డిమాండ్‌ చేశారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని