పిరికిపంద కావాలా.. పులిబిడ్డ కావాలా?

ప్రధానాంశాలు

పిరికిపంద కావాలా.. పులిబిడ్డ కావాలా?

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

జమ్మికుంట గ్రామీణం, న్యూస్‌టుడే: పిరికిపంద కావాలా.. పులిబిడ్డ కావాలా?.. వంగి వంగి దండాలు పెట్టే బానిస కావాలా.. ఎదురించి పోరాడే ధైర్యవంతుడు కావాలా?... తేల్చాల్సింది హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలేనని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట సీతారామ చంద్రస్వామి ఆలయంలో శుక్రవారం స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇల్లందకుంట మండలంలోని ఏడు గ్రామాల్లో భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం పదవి తన ఎడమకాలి చెప్పుతో సమానమని తెలంగాణ ప్రజలను అవమానించిన వ్యక్తికి ఉప ఎన్నికలో ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. కేసీఆర్‌ కుటుంబానికి అబద్ధాలు ఆడటమే తెలుసని ఎద్దేవా చేశారు. దళిత బంధు పథకం రావడానికి కారణం ఈటల రాజేందరేనని, దానికి ఈటల రాజేందర్‌ హుజూరాబాద్‌ పథకం అని పేరు పెట్టాలని డిమాండ్‌ చేశారు. ‘దళిత బంధును భాజపా నాయకులు ఆపారని అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలయ్యాక ఒకే రోజు అందరికీ దళిత బంధు ఇవ్వాలి’ అని డిమాండ్‌ చేశారు. ఆత్మగౌరవం కలిగిన హుజూరాబాద్‌ ప్రజలను కొనే శక్తి కేసీఆర్‌కు లేదన్నారు. అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరాలంటే తెరాస ప్రభుత్వాన్ని గద్దె దించాలన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని