పెట్రోల్‌, డీజిల్‌ పన్నులపై చర్చకు వస్తారా?

ప్రధానాంశాలు

పెట్రోల్‌, డీజిల్‌ పన్నులపై చర్చకు వస్తారా?

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి మంత్రి హరీశ్‌రావు సవాల్‌

హుజూరాబాద్‌ పట్టణం, హుజూరాబాద్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్రం వేసిన పన్నులపై చర్చకు వస్తారా అంటూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సవాల్‌ విసిరారు. హుజూరాబాద్‌ తెరాస కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బేసిక్‌ ఎక్సైజ్‌ డ్యూటీతో పాటు రోడ్డు సెస్సు, సర్‌ ఛార్జీలు వేస్తున్నది నిజం కాదా అని అడిగారు. 2014లో భాజపా అధికారంలోకి వచ్చాక లీటరు పెట్రోలుపై పన్ను రూ.10.43 ఉండగా.. ప్రస్తుతం రూ.32.90 ఉందని, ఏడేళ్లలో లీటరుకు రూ.22.47 వరకు పెంచిందన్నారు. 2014లో డీజిల్‌పై రూ.4.52 పన్ను ఉండగా, ప్రస్తుతం రూ.31.80 ఉందని... ఏడేళ్లలో రూ.27.28 పెరిగిందన్నారు. దీనిపై చర్చకు తాను సిద్ధమని, కేంద్ర మంత్రిగా మీరు వస్తారా అని కిషన్‌రెడ్డిని సవాల్‌ చేశారు. కేంద్రం పెంచిన పన్నుల భారంతోనే నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయన్నారు. అబద్ధాల భాజపాకు ఆస్కార్‌ అవార్డు ఇవ్వాలని ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు పొందాలని చూస్తున్నారన్నారు. దళిత బంధు పథకాన్ని నిలిపివేయాలని కోరింది భాజపా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాదా అని ప్రశ్నించారు. తెరాస నేత కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా సీఎం కేసీఆర్‌ నామినేట్‌ చేస్తే... గవర్నర్‌ మీ చేతుల్లో ఉన్నారని, ఆ ఎమ్మెల్సీని ఆపింది మీరు కాదా అని విమర్శించారు. 


హుజూరాబాద్‌లో డబ్బు పంపిణీకి ఈటల ఏర్పాట్లు

ఎన్నికల ప్రధానాధికారికి తెరాస ఫిర్యాదు

ఈనాడు, హైదరాబాద్‌: హుజూరాబాద్‌లో భాజపా అభ్యర్థి ఈల రాజేందర్‌ ఓటర్లను ప్రలోభ పెట్టేలా డబ్బు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారని తెరాస నాయకులు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌కు ఫిర్యాదు చేశారు. తెరాస ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, సీనియర్‌ నేత గట్టు రామచంద్రరావులు శుక్రవారం గోయల్‌ను ఆయన కార్యాలయంలో కలిసి ఫిర్యాదు పత్రాలను అందజేశారు. ‘నియోజకవర్గంలో ఈటల కొత్త బ్యాంకు ఖాతాలను ప్రారంభించి, వాటిలో డబ్బులు జమ చేస్తున్నారు. తద్వారా ఓటర్ల ఖాతాల్లోకి బదిలీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి’ అని వారు కోరారు.


 


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని