శంషాబాద్‌ అభివృద్ధికి జీవో 111 విఘాతం

ప్రధానాంశాలు

శంషాబాద్‌ అభివృద్ధికి జీవో 111 విఘాతం

ఎన్నికలప్పుడే సీఎం కేసీఆర్‌కు అది గుర్తుకొస్తుంది

పాదయాత్రలో వైతెపా అధ్యక్షురాలు షర్మిల ధ్వజం

శంషాబాద్‌, న్యూస్‌టుడే: హైదరాబాద్‌కు కూత వేటు దూరంలో ఉన్న శంషాబాద్‌ అభివృద్ధికి జీవో 111 విఘాతంగా మారిందని వైతెపా అధ్యక్షురాలు షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. దానిని ఎత్తివేసే అంశం అటకెక్కిందన్నారు. ‘‘ఎన్నికల సమయంలోనే సీఎం కేసీఆర్‌కు అది గుర్తుకొస్తుంది. ఏడేళ్లుగా పాలిస్తున్నా.. ఆ జీవో ఎత్తివేత దేవుడెరుగు.. కనీసం సడలించలేకపోయారు’’ అని ధ్వజమెత్తారు. శుక్రవారం మూడో రోజు ప్రజా ప్రస్థానం పాదయాత్ర రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో సాగింది. ఇక్కడ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు. ‘‘బంగారు తెలంగాణ అంటూనే రాష్ట్రాన్ని బార్ల తెలంగాణగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. ప్రజల్లో చైతన్యం రాకపోతే.. కేసీఆర్‌ పాలన ఇలాగే సాగితే త్వరలోనే అప్పుల తెలంగాణగా మారడం ఖాయం. వైఎస్‌ఆర్‌ బిడ్డగా చెబుతున్నా.. మాకు ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తాం’’ అని అన్నారు. ‘‘తెలంగాణలో సమస్యలు లేవని అంటున్నారుగా.. మీరు(కేసీఆర్‌, కేటీఆర్‌) నాతో కలిసి పాదయాత్ర చేయండి. సమస్యలు ఉంటే మీ కుటుంబ సభ్యులంతా పదవులకు రాజీనామాలు చేసి ఓ దళితుడిని ముఖ్యమంత్రిని చేయాలి’’ అని షర్మిల సవాలు విసిరారు. సమస్యలు లేకుంటే క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసి తాను ఇంటికి వెళ్లిపోతానన్నారు.

మూతబడుతున్న ప్రభుత్వ విద్యా సంస్థలు

‘‘తెలంగాణలో 3,500 ప్రభుత్వ పాఠశాలలను మూసి వేశారు. 65 శాతం అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంకా విద్యార్థుల చదువులు ఎలా సాగుతాయో పాలకులకు తెలియాలి. నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదు’’ అని షర్మిల అన్నారు. శంషాబాద్‌కు అంతర్జాతీయ విమానాశ్రయం, బాహ్యవలయ రహదారి, ఎక్స్‌ప్రెస్‌ వే, ఐటీ రంగం రావడం వైఎస్‌ఆర్‌ పుణ్యమే అని అన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని