తెరాస అధ్యక్షునిగా మళ్లీ కేసీఆర్‌!

ప్రధానాంశాలు

తెరాస అధ్యక్షునిగా మళ్లీ కేసీఆర్‌!

ఏకగ్రీవం కానున్న ఎన్నిక ఆయన పేరిటే 18 నామినేషన్లు నేడు పరిశీలన

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్టీ అధ్యక్షునిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఆయన ఒక్కరి పేరిటే మొత్తం 18 నామినేషన్లు దాఖలయ్యాయి. మరో అభ్యర్థి ఎవరూ నామినేషన్‌ వేయలేదు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరించి పార్టీ అధ్యక్ష పదవికి ఈ నెల 17 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తదితరులు కేసీఆర్‌ పేరిట వాటిని దాఖలు చేశారు. చివరి రోజైన శుక్రవారం రెండు నామినేషన్లు వచ్చాయి. మొత్తం 18 నామినేషన్లను శనివారం పరిశీలించనున్నారు. ఉపసంహరణకు ఆదివారం గడువు. ఈ నెల 25న హెచ్‌ఐసీసీలో జరిగే పార్టీ ప్లీనరీలో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. అందులో కేసీఆర్‌ ఎన్నికను అధికారికంగా ప్రకటించనున్నారు.

పోడు భూములపై నేడు సీఎం సమీక్ష

పోడు భూముల సమస్య పరిష్కారం, అడవుల పరిరక్షణ, హరితహారం ప్రధానాంశాలుగా శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. మంత్రులు, కలెక్టర్లు, అటవీశాఖ ఉన్నతాధికారులు పాల్గొంటారు. సీఎం ఆదేశాల మేరకు ఈ నెల 20 నుంచి శుక్రవారం వరకు అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆధ్వర్యంలో అధికారుల బృందం పోడు భూములపై క్షేత్రస్థాయి అధ్యయనం చేసింది. దీనిపై సీఎం కార్యాలయానికి నివేదిక కూడా సమర్పించింది. పోడు వ్యవసాయం చేస్తున్న ఆదివాసీ గిరిజనుల సమస్యలపైనా ప్రజాప్రతినిధులు నివేదించారు. వీటన్నింటిపైనా సీఎం చర్చించి, సమగ్ర కార్యాచరణను ప్రకటించనున్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని