ఓటమి భయంతోనే చౌకబారు ఆరోపణలు: భట్టి

ప్రధానాంశాలు

ఓటమి భయంతోనే చౌకబారు ఆరోపణలు: భట్టి

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: గాంధీభవన్‌లో గాడ్సేలు దూరారని, పీసీసీ అధ్యక్ష పదవి కోసం రేవంత్‌రెడ్ది వద్ద మాణికం ఠాగూర్‌ రూ.50 కోట్లు తీసుకున్నారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ చేసిన ఆరోపణలను కాంగ్రెస్‌ నేతలు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్‌, భాజపాల మధ్య చీకటి ఒప్పందం కుదిరిందనడం సరికాదన్నారు. ఓటమి భయంతోనే కేటీఆర్‌ ఇలాంటి నిరాధారమైన, చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇకపై నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు. సీఎల్పీ నేత భట్టివిక్రమార్క శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భాజపా మతతత్వ పార్టీ, కాంగ్రెస్‌ సెక్యులర్‌ పార్టీ..రెండు భిన్న ధృవాలు ఎలా కలుస్తాయి? కేటీఆర్‌ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. తెరాస, భాజపా మధ్యే లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయి. ఈటల అవినీతిపై ప్రభుత్వం చేపట్టిన విచారణ ఎటుపోయింది? ఎన్నికల తర్వాత ఈటల కాంగ్రెస్‌లోకి వస్తారనడం ఊహాజనితం. గాంధీభవన్‌లో గాడ్సేలు ఉండరు..కాంగ్రెస్‌ భావజాలం ఉన్నవారే ఉంటారు. దళితబంధును ఆపడంలో భాజపా, తెరాస పాత్ర ఉంది. కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ బలమైన అభ్యర్థి కాదని ఎవరన్నా అంటే అది వారి అవగాహన రాహిత్యమే’’ అని భట్టి అన్నారు.  ఈటల భాజపాలో చేరిన తర్వాత రేవంత్‌రెడ్డిని కలిసినట్లు నిరూపిస్తారా? అని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌, అధికార ప్రతినిధులు బెల్లయ్యనాయక్‌, అయోధ్యరెడ్డి, కాల్వ సుజాతలు సవాల్‌ చేశారు. భాజపాతో కేసీఆర్‌ కుమ్మక్కయ్యారని పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల తర్వాత 15 మంది తెరాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని మండలిలో మాజీ ప్రతిపక్షనేత, పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్‌ షబ్బీర్‌అలీ ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని