తిట్టడమే భాజపా నేతల పని

ప్రధానాంశాలు

తిట్టడమే భాజపా నేతల పని

దళితబంధుపై లేఖ విషయంలో క్షమాపణ చెప్పాలి: మంత్రి హరీశ్‌రావు

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌: ప్రజలకు ఏం చేస్తామనేది చెప్పకుండా.. ప్రత్యర్థులను తిట్టడమే భాజపా వాళ్ల పనిగా ఉందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం హుజూరాబాద్‌ పట్టణంలో, జమ్మికుంట మండలం నాగంపేట్‌లో నిర్వహించిన ప్రచారంలో ఆయన మాట్లాడారు. ‘‘గ్యాస్‌ సిలిండర్‌ ధరపై రాష్ట్ర పన్ను రూ.291 ఉందని వాళ్లు అబద్ధాలు చెబుతున్నారు. చర్చకు రమ్మంటే ఎవరూ రాలేదు. ఇంధన ధరలపై కేంద్ర ప్రభుత్వం ఏడేళ్ల పాలనలో పన్నును విపరీతంగా పెంచింది. ఈ విషయమై చర్చకు రమ్మని కేంద్ర మంత్రి సహా భాజపా వాళ్లను పిలిచినా ఎవరూ స్పందించడంలేదు. రైతుల పక్షపాతిగా కేసీఆర్‌ను ప్రజలు గుర్తిస్తుంటే.. పారిశ్రామికవేత్తల పక్షపాతిగా భాజపా వ్యవహరిస్తోంది. ఏడేళ్ల పాలనలో కేంద్రం చేసిన అభివృద్ధికి.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. అన్ని రకాలుగా అభివృద్ధి, సంక్షేమాలను అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని కూలగొడతానంటున్న ఈటల రాజేందర్‌కు ఓటుతో ప్రజలు గుణపాఠం చెప్పాలి’’ అని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. దళితబంధును ఆపేందుకు లేఖ రాసిన భాజపా.. ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అనంతరం హుజూరాబాద్‌లో విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. భాజపా అమ్మకానికి.. తెరాస నమ్మకానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి 15 ప్రశ్నలతో కూడిన బహిరంగ లేఖను విడుదల చేశారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని