ఆత్మాభిమానానికి.. నియంతృత్వానికి పోటీ

ప్రధానాంశాలు

ఆత్మాభిమానానికి.. నియంతృత్వానికి పోటీ

ఉపఎన్నిక ఫలితంతో రాష్ట్ర చరిత్ర తిరగరాయాలి
ఓటర్లకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పిలుపు
ఈటల వల్లే ‘దళితబంధు’ వచ్చిందని వ్యాఖ్య

కమలాపూర్‌, న్యూస్‌టుడే- ఈనాడు, వరంగల్‌: హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఆత్మాభిమానానికి, నియంతృత్వానికి మధ్య జరుగుతోందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఈ ఎన్నిక ఫలితంతో రాష్ట్ర చరిత్రను హుజూరాబాద్‌ ప్రజానీకం తిరగరాయాలని కోరారు. శనివారం ఆయన కమలాపూర్‌ మండలం శ్రీరాములపల్లి, అంబాల, గూడూరు, దేశరాజుపల్లి, కానిపర్తి, శంభునిపల్లి గ్రామాల్లో నిర్వహించిన సభల్లో మాట్లాడారు. ‘‘ఈ ప్రభుత్వం నిజాం అడుగుజాడల్లో నడుస్తోంది. కేసీఆర్‌ కుటుంబపాలనకు వ్యతిరేకంగా హుజూరాబాద్‌ నుంచే ఆట మొదలైంది. సీఎం డబ్బులను నమ్ముకున్నారు. ప్రజలపై ఆయనకు నమ్మకం లేదు. హుజూరాబాద్‌ ప్రజలను గొర్రె పిల్లలుగా భావిస్తున్నారు. పులిబిడ్డలని నిరూపించాలి. ఈ ఎన్నిక ప్రతిష్ఠాత్మకమైంది. దేశమంతా మీ వైపు చూస్తోంది’’ అని వ్యాఖ్యానించారు. దళితబంధు ఈటల వల్లే వచ్చిందని, ఈ పథకానికి ఈటల రాజేందర్‌ హుజూరాబాద్‌ దళితబంధు పథకం అని నామకరణం చేయాలని కిషన్‌రెడ్డి సూచించారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఈ నెల 31వ తేదీనే దళితబంధు నిధులు ఇవ్వాలన్నారు. తెరాసపై ‘ఈటె’ను వదిలి ఈటల రాజేందర్‌ విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

ఖరీదైన ఉపఎన్నికగా హుజూరాబాద్‌
దేశంలో మరెక్కడా లేనంత ఖరీదైనదిగా హుజూరాబాద్‌ ఉపఎన్నిక మారిందని కిషన్‌రెడ్డి అన్నారు. శనివారం హనుమకొండలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. శుక్రవారం ఇల్లందకుంటలో తెరాస, భాజపా మధ్య జరిగిన గొడవను ఉద్దేశించి మాట్లాడుతూ తన రోడ్‌షోను అడ్డుకోవడాన్ని తప్పుపట్టారు. ఉపఎన్నికలో గెలుపు భాజపాదే అని తేలిపోయిందని, అందుకే ఎన్నిక కన్నా పార్టీ ప్లీనరీనే ముఖ్యమని కేటీఆర్‌ అంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తదితరులు పాల్గొన్నారు.


కేసీఆర్‌ కుట్రతోనే దళితబంధు ఆగింది: బండి సంజయ్‌

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుట్రపూరిత రాజకీయంతోనే హుజూరాబాద్‌లో దళితబంధు పథకం ఆగిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ఈ విషయంపై తాను ప్రమాణం చేసేందుకు యాదాద్రి రమ్మని సవాలు విసిరినా.. ఎందుకు స్పందించలేదని పేర్కొన్నారు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలంలోని పలు గ్రామాల్లో శనివారం ఆయన రోడ్‌షోలు నిర్వహించి మాట్లాడారు. ‘‘సీఎం ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా.. ఏదో ఒక కొర్రీతో మధ్యలోనే ఆపుతారు. దళితబంధు పథకాన్ని ప్రారంభించి 80 రోజులు కావస్తున్నా.. ఎందుకు యూనిట్లను ప్రారంభించలేదో తెరాస నేతలు చెప్పాలి. రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయించే బాధ్యత భాజపాదే. కేసీఆర్‌కు ప్రజలమీద ప్రేమ ఉంటే పెట్రోల్‌పై ఉన్న 41 రూపాయల రాష్ట్ర పన్ను తగ్గించాలి’’ అని సంజయ్‌ వ్యాఖ్యలు చేశారు.


నా కళ్లల్లో మట్టి కొట్టారు..  
కేసీఆర్‌పై ఈటల విమర్శ

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌: పద్దెనిమిదేళ్ల ఉద్యమంలో తనను ఉపయోగించుకున్న కేసీఆర్‌.. ఇప్పుడు కళ్లల్లో మట్టికొట్టారని మాజీ మంత్రి, భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఆరోపించారు. కేసీఆర్‌ దుర్మార్గం ఇక మీదట చెల్లదని, తెలంగాణకు ఆయన ఓనరు కాదని అన్నారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలంలోని పలు గ్రామాల్లో శనివారం ఆయన  ప్రచారం నిర్వహించారు. హుజూరాబాద్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే తెరాసకు డిపాజిట్‌ దక్కదని జోస్యం చెప్పారు. ఈ నెల 30 తరువాత తన సత్తా చూపిస్తానని వ్యాఖ్యానించారు. సిద్దిపేటకు వస్తానని మంత్రి హరీశ్‌రావుకు సవాల్‌ విసిరారు. ‘‘ఫాంహౌస్‌లో పొగపెట్టి కేసీఆర్‌ను బయటకు పంపడమే ఇకపై నా పని. కేసీఆర్‌తోపాటు ఆయనకు బానిసలుగా ఉన్నవాళ్ల పనిపడతా’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని