వైఎస్సార్‌ సంక్షేమ పాలన వైతెపాతోనే

ప్రధానాంశాలు

వైఎస్సార్‌ సంక్షేమ పాలన వైతెపాతోనే

పార్టీ అధ్యక్షురాలు షర్మిల

మహేశ్వరం, న్యూస్‌టుడే: ‘మళ్లీ మళ్లీ చెబుతున్నా.. తెలంగాణ ప్రజలకు జరిగిన మోసం చాలు.. కేసీఆర్‌ పాలన పోవాలి.. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సంక్షేమ పాలన రావాలంటే వైఎస్సార్‌ తెలంగాణ పార్టీని ఆదరించండి’ అని ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రజలను కోరారు. చేవెళ్ల నుంచి ఆమె చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర అయిదో రోజు ఆదివారం మహేశ్వరం మండలంలో సాగింది. శనివారం నాగారంలో బస చేసిన ఆమె ఆదివారం ఉదయం పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఉదయం 10 గంటలకు నడక ప్రారంభించారు. నాగారం, పెద్దతండా, డబిల్‌గూడ, మన్‌సాన్‌పల్లి, కేసీతండా మీదుగా పాదయాత్ర సాయంత్రం మహేశ్వరానికి చేరుకుంది.

అంతకుముందు మన్‌సాన్‌పల్లిలో వైఎస్సార్‌, అంబేడ్కర్‌ విగ్రహాలకు ఆమె పూలమాలలు వేసి నివాళి అర్పించారు. మహేశ్వరంలో వ్యాన్‌పై నుంచి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. వైఎస్సార్‌ సంక్షేమ పాలన అంటే ఉచిత విద్య, ఉచిత వైద్యం, నిరుపేదలకు సొంత ఇల్లు, వ్యవసాయం అంటే పండుగ, నిరుద్యోగులకు ఉద్యోగాలు, అప్పులు లేకుండా జీవించడం అన్నారు. తెరాస, భాజపాలు ఒకదాని కోసం మరొకటి పనిచేస్తున్నాయని ఎద్దేవా చేశారు. ‘మాకు మతతత్వ భాజపా అవసరం లేదు, ప్యాకేజీల కోసం... అమ్ముడుపోదామని చూస్తున్న కాంగ్రెస్‌తో పొత్తు లేదు, తెరాసతో మైత్రి లేదు, సింహం సింగిల్‌గానే వస్తుంది’ అన్నారు. పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలు పెరిగిపోయి ప్రజలు కష్టాలు పడుతున్నారంటే కేసీఆర్‌, మోదీలే కారణమన్నారు. ఈ ప్రాంతంలో ఐటీఐఆర్‌ ప్రాజెక్టును ఎందుకు తీసుకురాలేకపోతున్నారని ప్రశ్నించారు. మహేశ్వరం నుంచి రెండు కిలోమీటర్ల పాదయాత్ర అనంతరం తుమ్మలూరులో ఏర్పాటు చేసిన శిబిరంలో ఆదివారం రాత్రి ఆమె బస చేశారు. వైతెపా నాయకులు కొండా రాఘవరెడ్డి, పెద్దబావి వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని