అప్పుల రాష్ట్రంగా మార్చారు

ప్రధానాంశాలు

అప్పుల రాష్ట్రంగా మార్చారు

కేసీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధ్వజం

తోకలపల్లిలోని దళితబస్తీలో సహపంక్తి భోజనం చేస్తున్న కిషన్‌రెడ్డి

ఈనాడు డిజిటల్‌-కరీంనగర్‌, న్యూస్‌టుడే-హుజూరాబాద్‌ గ్రామీణం: ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన కేసీఆర్‌.. తన కుటుంబాన్ని మాత్రం బంగారు కుటుంబంగా మార్చుకున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. సోమవారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం చెల్పూరు గ్రామ పంచాయతీ పరిధిలోని తోకలపల్లిలో దళితులతో కలిసి ఆయన సహపంక్తి భోజనం చేశారు. అనంతరం రాంపూర్‌, హుజూరాబాద్‌ పట్టణంలో నిర్వహించిన ప్రచారంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్‌ కుటుంబాన్ని తరిమికొట్టే రోజులు వస్తాయని చెప్పారు. ఈటల రాజేందర్‌ ముఖాన్ని అసెంబ్లీలో చూడొద్దని కేసీఆర్‌ కుట్రలు చేస్తున్నారని, కానీ భవిష్యత్తులో అసెంబ్లీలో కేసీఆర్‌ ముఖమే కనిపించదని జోస్యం చెప్పారు. ప్రచారంలో ఈటల రాజేందర్‌ పాల్గొన్నారు.

ఈసీ నిబంధనలు కేసీఆర్‌కు మాత్రమే కాదు: బండి సంజయ్‌

ముఖ్యమంత్రి స్థాయిలో ఎన్నికల సంఘంపై నిందలు వేయడం, సీఎం కోసమే ఈసీ ప్రత్యేకమైన నిబంధనలు పెట్టిందనడం సరికాదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. బెంగాల్‌ ఎన్నికల్లో ఈసీ నిబంధనల వల్ల ప్రధాని సమావేశాలు సైతం రద్దయ్యాయని.. హుజూరాబాద్‌లో తాము అమిత్‌షా సభనూ రద్దు చేసుకున్నామని తెలిపారు. కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం బేతిగల్‌లో సోమవారం ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. తెరాస ప్లీనరీలో సీఎం కేసీఆర్‌ చెప్పినవన్నీ అబద్ధాలేనని సంజయ్‌ ఆరోపించారు. ప్రజల్ని బురిడీ కొట్టించడంలో.. అబద్ధాలను అందంగా చెప్పడంలో ఆయనకు ఆస్కార్‌ అవార్డు ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు.

ఒవైసీ కనుసన్నల్లో రాష్ట్ర ప్రభుత్వం

తెలంగాణలో ఎంఐఎంతో సీఎం కేసీఆర్‌ కలిసి పనిచేస్తున్నారని... ఒవైసీ కనుసన్నల్లోనే రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ అన్నారు. కరీంనగర్‌ జిల్లా ఆబాదీ జమ్మికుంటలో సోమవారం నిర్వహించిన యాదవ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు.

కేసీఆర్‌ చెడ్డరాజుగా మిగిలిపోతారు: ఈటల

చరిత్రలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెడ్డరాజుగా మిగిలిపోతారని మాజీ మంత్రి, భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ అన్నారు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట, హుజూరాబాద్‌లలో సోమవారం నిర్వహించిన ప్రచారంలో ఆయన మాట్లాడారు. ‘‘కేసీఆర్‌ హుజూరాబాద్‌లో ఉప ఎన్నికల్లో రూ.వెయ్యి కోట్లు ఖర్చు పెట్టెను. రూ.వంద కోట్ల మద్యం తాగించెను. రూ.4,500 కోట్ల విలువైన జీవోలు ఇచ్చెను. అయినా అక్కడ తెరాస ఓడిపోయెను’’ అని రాబోయే రోజుల్లో చదువుకునే పరిస్థితి వస్తుందని ఈటల జోస్యం చెప్పారు.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని