భాజపా మేనిఫెస్టో పెద్ద జోక్‌

ప్రధానాంశాలు

భాజపా మేనిఫెస్టో పెద్ద జోక్‌

రైల్వే లైన్లే ఇవ్వలేదు.. స్టేషన్‌ను అభివృద్ధి చేస్తారా?

హుజూరాబాద్‌ ప్రచారంలో మంత్రి హరీశ్‌రావు

ఇల్లందకుంటలో ప్రసంగిస్తున్న మంత్రి హరీశ్‌రావు

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌: భాజపా రాష్ట్ర ఇన్‌ఛార్జి తరుణ్‌ ఛుగ్‌ హుజూరాబాద్‌లో విడుదల చేసిన మేనిఫెస్టో ఒక పెద్ద జోక్‌ అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. జమ్మికుంట రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తామని అందులో చెప్పారని.. ఇన్నాళ్లుగా ఇస్తామన్న రైల్వే లైన్‌లనే ఇవ్వని పార్టీ ఏం అభివృద్ధి చేస్తుందని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏడేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంటలో మంగళవారం జరిగిన ప్రచార సభలో హరీశ్‌రావు మాట్లాడారు. భాజపా గెలవదని.. రాష్ట్రంలో అధికారంలోకి రాదని స్పష్టంచేశారు. ధరలు పెంచే పార్టీ కావాలా? పేదలకు మేలు చేసే పార్టీ కావాలా? అనేది హుజూరాబాద్‌ ప్రజలు తేల్చుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. మంత్రిగా ఉన్న సమయంలోనే ఈటల రాజేందర్‌ నియోజకవర్గంలో ప్రజలు ఆశించిన అభివృద్ధిని చేపట్టలేదని.. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా గెలిస్తే ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఈటల భాజపాలో చేరి హుజూరాబాద్‌ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని విమర్శించారు. ప్రచారంలో తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈటల గెలిస్తే అభివృద్ధి చేయలేరు: మంత్రి తలసాని

వీణవంక, న్యూస్‌టుడే: హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్‌ గెలిస్తే ఏ అభివృద్ధీ చేయలేరని, తన చేతిలో ఏమీ లేదంటారని.. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ గెలిస్తే అన్నీ చేస్తారని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలంలోని పలు గ్రామాల్లో ఆయన మంగళవారం ప్రచారం నిర్వహించారు. అనంతరం వీణవంకలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌, భాజపాల రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌లు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని.. ఆ రెండు పార్టీలకు ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఏడేళ్లలో రైతులు, పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని మంత్రి చెప్పారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్‌ రాదని... హుజూరాబాద్‌లో భాజపా లేదని అన్నారు. ఈటల రాజీనామా చేస్తే పథకాలు రాలేదని, గతంలో ఉన్నవే కొనసాగుతున్నాయని ఆయన స్పష్టంచేశారు. ఈ సమావేశంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశ్‌, తెరాస నేత పాడి కౌశిక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని