కేసీఆర్‌ ఏపీలో పార్టీ పెట్టొద్దని ఎవరన్నారు?: సజ్జల

ప్రధానాంశాలు

కేసీఆర్‌ ఏపీలో పార్టీ పెట్టొద్దని ఎవరన్నారు?: సజ్జల

ఈనాడు, అమరావతి: ‘ఏపీలో పార్టీ పెట్టవద్దని కేసీఆర్‌ను ఎవరన్నారు? ఆయన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించారు. వారి మధ్య అవగాహన ఏంటో తెలియదు. పార్టీ పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు, దానికి ఎవరి అనుమతీ అక్కర్లేదు. ఇక్కడకు వచ్చాక ఏమవుతుందో చూడొచ్చు’ అని ఆ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం ఆయన వైకాపా కేంద్ర కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ఏపీలో కరెంటు కోతలున్నాయి, ఏపీలో తెరాస ఏర్పాటుకు విజ్ఞప్తులు వస్తున్నాయన్న కేసీఆర్‌ వ్యాఖ్యలపై ఓ విలేకరి అడగ్గా సజ్జల స్పందిస్తూ.. ‘తెలంగాణలో మిగులు విద్యుత్‌ ఉందని కేసీఆర్‌ అంటున్నారు, శ్రీశైలంలో అడ్డగోలుగా నీటిని వాడేస్తే వారికా కరెంట్‌ వచ్చింది. సింగరేణిలో వారేం చేశారో చెప్పక్కర్లేదు’ అన్నారు. కేసీఆర్‌ ఇతర వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. ‘రాష్ట్రం విడిపోతే తెలంగాణ అంధకారం అవుతుందని కొందరు ఆంధ్రా నాయకులు అప్పట్లో వ్యాఖ్యానించారని కేసీఆర్‌ చెబుతున్నారు. మీరు ఆంధ్రా నాయకత్వం కింద ఉంటేనే రాష్ట్రం బాగుంటుందని ఎవరూ చెప్పలేదు. కలిసుంటే బాగుంటామని, ఉమ్మడి రాష్ట్రం దేశంలోనే అగ్రగామి కావడానికి అవకాశాలుంటాయని జగన్‌ చెప్పారు. హైదరాబాద్‌ లాంటి పెద్ద నగరం లేని ఏపీ అంధకారం అవుతుందని, జలవివాదాలు వస్తాయని అన్నారు. అది వాస్తవం కూడా. ఈ రోజు కేసీఆర్‌ వచ్చి విభజన అన్యాయంగా జరిగిందంటే ఎలా? అసలు అన్యాయం జరిగింది ఏపీకి. తెలంగాణ కాదు... మన (ఏపీ) బతుకు అంధకారమయింది. విడిపోతామన్న వారికే రాజధాని సహా ఇచ్చారు, కలిసుందామన్నవారిని బలవంతంగా విడదీసి ఎలాంటి ప్రయోజనాలు కల్పించకుండా పంపేశారు. ప్రత్యేకహోదా ఇస్తామని భాజపా మోసం చేసింది. తర్వాత చంద్రబాబు అయిదేళ్లలో రూ.2 లక్షల కోట్లకు పైగా అప్పు చేసి మా మీద పడేసినా ముఖ్యమంత్రి జగన్‌ నిబ్బరంగా లాక్కొస్తున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి ఉండటం అడ్వాంటేజ్‌. ఆయనపై రాజకీయంగా పోటీకి ఎవరైనా రావచ్చు’ అని వ్యాఖ్యానించారు.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని