తెరాస, భాజపా మ్యాచ్‌ ఫిక్సింగ్‌

ప్రధానాంశాలు

తెరాస, భాజపా మ్యాచ్‌ ఫిక్సింగ్‌

 సీఎం దిల్లీ పర్యటన అందులో భాగమే

కేసీఆర్‌ వైఖరి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు రేవంత్‌రెడ్డి లేఖ

గాంధీభవన్‌, న్యూస్‌టుడే:  తెరాస, భాజపా రాజకీయ చదరంగంలో అన్నదాత పావుగా మారాడని, ఆ రెండు పార్టీలు రైతాంగ విశ్వాసాన్ని కోల్పోయాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రైతుల జీవితాలతో ఆడుకోవద్దని.. వారి చుట్టూ రాజకీయాలు చేయొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు స్పష్టం చేశారు. తడిసిన ధాన్యం కొనే అంశంపై ప్రభుత్వ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని, ‘కనీస మద్దతు ధర’కు చట్టబద్ధత కల్పించాలని, మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ ఫండ్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. రేవంత్‌రెడ్డి బుధవారం తెలంగాణ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. యాసంగి ధాన్యం కొనే అంశంలో ఒత్తిడి చేయబోమంటూ కేంద్రానికి కేసీఆర్‌ ఇచ్చిన లేఖే నేడు వరి రైతుల పాలిట ఉరి తాడయిందని పేర్కొన్నారు.  కేసీఆర్‌ వైఖరిని గమనించాలని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ప్రజలను రేవంత్‌రెడ్డి కోరారు. ‘‘సీఎం కేసీఆర్‌ దిల్లీ పర్యటన.. తెరాస, భాజపా మ్యాచ్‌ ఫిక్సింగ్‌లో భాగమే. కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యం, అలసత్వం కారణంగా.. రోజుల తరబడి కల్లాల్లో ఉన్న ధాన్యం వర్షాలకు తడిసి మొలకలు వస్తున్నాయి. రైతు కన్నీరు తుడవాల్సిన ముఖ్యమంత్రి.. ఇందిరాపార్కు వద్ద ఏసీ టెంటు కింద రెండు గంటలు సేద తీరి వెళ్లిపోయారు. తాము కల్లాల్లో గోస పడుతుంటే కనీసం ఎమ్మెల్యే స్థాయి నాయకుడు కూడా కన్నెత్తి చూడటం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన ఏడున్నరేళ్లలో రాష్ట్రంలో 7,409 మంది రైతులు చనిపోతే, 1,350 మందికి మాత్రమే పరిహారం అందింది. మిగతా వారికి తక్షణం సాయం అందజేయాలి. రైతు, పంటల బీమా సమగ్రంగా అమలు చేయాలి’’ అని లేఖలో రేవంత్‌ కోరారు.

ప్రజాస్వామ్యానికి మచ్చ

ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చేలా తెరాస వ్యవహరించిందని రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్‌ వేయడానికి మంగళవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌కు వెళ్లిన రాష్ట్ర ఎంపీటీసీ సభ్యుల ఫోరం అధ్యక్షురాలు శైలజ నామపత్రాలను తెరాస నేతలు చించివేసిన ఘటనపై ఆయన ట్విటర్‌లో స్పందించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని