మాకు... జూనియర్‌ ఎన్టీఆర్‌కి ఏంటి సంబంధం?

ప్రధానాంశాలు

మాకు... జూనియర్‌ ఎన్టీఆర్‌కి ఏంటి సంబంధం?

మేం వైకాపాలో ఉన్నాం.. జగన్‌ కోసం ఏమైనా చేస్తాం
మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ‘మాకు జూనియర్‌ ఎన్టీఆర్‌కి ఏంటి సంబంధం. నన్ను, వంశీని ఆయన ఎందుకు నియంత్రిస్తారు. మేమేమన్నా ఆయన పార్టీనా? ఆయన సినిమాకు నిర్మాతలమా? లేదా డైరెక్టర్లమా? లేకపోతే ఆయన దగ్గరేమన్నా నటన నేర్చుకున్నామా? ఒకప్పుడు కలిసి ఉన్నాం. విభేదాలు వచ్చి బయటకు వచ్చాం. ఇప్పుడు వైకాపాలో ఉన్నాం. జగన్‌ మా నాయకుడు. ఆయన చెప్పినా... చెప్పకపోయినా ఆయన కోసం ఏదైనా చేస్తాం. జూనియర్‌ ఎన్టీఆర్‌ చెబితే మేమెందుకు వింటాం?’ అని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. సచివాలయ ఆవరణలో వైకాపాతో సన్నిహితంగా ఉంటున్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో కలిసి గురువారం విలేకరులతో మంత్రి మాట్లాడారు. ‘చంద్రబాబు శిష్యులు వైకాపా, తెరాసలో ఉన్నారు. స్పీకర్‌ తమ్మినేని సీతారాం, వైకాపా ఎమ్మెల్యే రోజా, తెరాస మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ చంద్రబాబు శిష్యులే కదా? వారు ఆయన్ని తిడుతున్నారుగా? వారిని చంద్రబాబు నియంత్రించారా?’ అని ప్రశ్నించారు. ‘నందమూరి కుటుంబం అంటే అందరికీ గౌరవం ఉంది. వాళ్లు చంద్రబాబు ఉచ్చులో చిక్కుకున్నారు. వాళ్లను చూస్తే జాలేస్తుంది. నందమూరి కుటుంబంలో ఒక్కరిని తప్ప చంద్రబాబు మిగతా వారందరినీ మోసం చేయగలరు’ అని పేర్కొన్నారు. ‘చంద్రబాబు సతీమణి గురించి ఆయనే అల్లరి చేసుకుంటుంటే మేమెందుకు క్షమాపణ చెప్పాలి. మేమేమన్నా అంటే కదా? ఆమె పేరును అసెంబ్లీ లోపల, బయట ఎక్కడా మేం చెప్పలేదు’ అని అన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని