‘ప్రైవేటుకు ధారాదత్తం చేసేందుకే భూముల అమ్మకం’
close

ప్రధానాంశాలు

‘ప్రైవేటుకు ధారాదత్తం చేసేందుకే భూముల అమ్మకం’

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఉత్తర్వులు జీవో 13 పేరుతో భూముల అమ్మకానికి సర్కారు శ్రీకారం చుట్టడం సరైన చర్య కాదని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విమర్శించారు. కేంద్రంలోని భాజపా, తెలంగాణలోని తెరాస ప్రభుత్వాలు భూముల విషయంలో ఒకరి మీద ఒకరు నెపం నెట్టుకుంటూ ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వ భూములను ధారాదత్తం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత రెండేళ్లుగా మాత్రమే కరోనా ప్రభావం రాష్ట్ర ఖజానాపై ప్రభావం చూపుతోంది కానీ ఆ నెపాన్ని చూపి తెరాస ప్రభుత్వం మిగులు బడ్జెట్‌ రాష్ట్రాన్ని దివాలా తీయించేసిందని దుయ్యబట్టారు. దుబారా ఖర్చు తగ్గించుకొని పొదుపు పాటిస్తూ ఆదాయాన్ని సమకూర్చుకునే ఆలోచన చేయకపోగా...భూములను అమ్ముకుంటున్నారని విమర్శించారు.
అమ్మకాన్ని అడ్డుకుంటాం: శ్రవణ్‌
ప్రభుత్వ భూముల అమ్మకాన్ని అడ్డుకుంటామని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ అన్నారు. ఆయన మంగళవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. భూములకు ప్రభుత్వం ట్రస్టీ మాత్రమేనని, యజమాని కాదని, వాటిని అమ్మే హక్కు లేదని గుర్తుచేశారు. రాష్ట్రంలో దివాలాకోరు పాలన సాగుతోందని మండిపడ్డారు. ప్రజల భవిష్యత్‌ తరాల కోసం భూములు, ప్రభుత్వాస్తులను కాపాడుకుంటామని స్పష్టం చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని