కేసీఆర్‌ మళ్లీ అధికారంలోకి రావడం కల్ల..!
close

ప్రధానాంశాలు

కేసీఆర్‌ మళ్లీ అధికారంలోకి రావడం కల్ల..!

భాజపాలోకి వచ్చేందుకు  తెరాస ముఖ్యనాయకులు సిద్ధం

బండి సంజయ్‌ వ్యాఖ్య 

హుజూరాబాద్‌కు రావాలంటూ సీఎంకు ఈటల సవాల్‌

ఈనాడు డిజిటల్, కరీంనగర్, న్యూస్‌టుడే- హుజూరాబాద్‌: కేసీఆర్‌ అరాచక పాలనకు చరమగీతం పాడాలని యావత్‌ తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారని.. ఆయన మళ్లీ అధికారంలోకి రావడం కల్ల అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. కమలం కండువా కప్పుకొనేందుకు కొందరు తెరాస ముఖ్య నాయకులు సిద్ధంగా ఉన్నారని ..రాష్ట్రంలో మరిన్ని చోట్ల త్వరలో ఉప ఎన్నికలొస్తాయని ఆయన జోస్యం చెప్పారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో శనివారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి భాజపా సమావేశంలో బండి సంజయ్, ఈటల రాజేందర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ..‘త్వరలోనే ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతి చిట్టా బయటకు తీస్తాం. కేసీఆర్‌ను ఎప్పుడు జైలుకు పంపాలో అప్పుడు పంపుతాం. సీఎం కుటుంబానికి భయం పట్టుకుంది. ఆ భయంతోనే ఉత్తర్వులు లేకుండానే జైళ్లను కూలుస్తున్నారు. ఇప్పుడు భూములన్నీ అమ్ముతున్నారు. భవిష్యత్తులో ప్రజలకున్న ఒక్కో గదిని కూడా అమ్మకానికి పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు’ అని ఎద్దేవా చేశారు. తెరాస నాయకులు కబ్జా చేసిన భూముల్ని స్వాధీనం చేసుకుంటే లక్షల కోట్ల రూపాయలు సర్కారు ఖజానాకు వస్తాయని వ్యాఖ్యానించారు. చంచల్‌గూడలోని జైలును కూడా కూల్చడానికి కేసీఆర్, ఒవైసీ నాటకమాడుతున్నారని ఆరోపించారు.

ఉప ఎన్నికలో కారుకు డిపాజిట్‌ రాదు: ఈటల

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ..తెలంగాణలో కేసీఆర్‌ డబ్బులు, ప్రలోభాలు, అధికార దుర్వినియోగాన్ని నమ్ముకుంటున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా హుజూరాబాద్‌లో ఎన్నిక జరిగితే కారు గుర్తుకు కనీసం డిపాజిట్‌ రాదన్నారు. సొంతపార్టీలో గెలిచిన ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసే నీచ చరిత్రతో కేసీఆర్‌ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు. హుజూరాబాద్‌లో పుట్టే నా గెలుపు ప్రభంజనం యావత్‌ తెలంగాణను చుట్టుముడుతుందని ధీమా వ్యక్తంచేశారు. ‘‘హుజూరాబాద్‌కు ఎప్పుడొస్తవో.. రా తేల్చుకుందాం’’ అంటూ సీఎంకు సవాల్‌ విసిరారు. ‘‘నీ సొంతూరు చింతమడకలో ఇంటింటికి పదిలక్షలు ఎట్లిచ్చినవో నా హుజూరాబాద్‌ నియోజకవర్గంలోనూ అదేవిధంగా ఇవ్వాలని కేసీఆర్‌ను డిమాండ్‌ చేస్తున్న. అభివృద్ధి.. ఆత్మగౌరవానికి ఎలాంటి ప్రత్యామ్నాయం కాదు. ఈ దేశాన్ని బ్రిటిష్‌ వాళ్లు కూడా అభివృద్ధి చేశారు. అయినా స్వాతంత్య్రం కోసం కొట్లాడినం. ఉమ్మడి రాష్ట్రంలోనూ సమైక్య పాలకులు తెలంగాణ అభివృద్ధికి రూ.50 వేల కోట్లిస్తామన్నారు. ఉద్యమాన్ని ఆపేయాలని కోరారు. అయినా ఆగలేదు’ అని ఈటల అన్నారు. 

కృష్ణా జలాల్లో హక్కుల్ని కాపాడటంలో వైఫల్యం

ఈనాడు, హైదరాబాద్‌: కృష్ణా జలాల్లో రాష్ట్ర హక్కుల్ని కాపాడటంలో తెరాస ప్రభుత్వం విఫలమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ శనివారం ఓ ప్రకటనలో విమర్శించారు. సుప్రీంకోర్టులో వేసిన కేసును ఆరేళ్లుగా ఉపసంహరించుకోకుండా సీఎం కేసీఆర్‌ ప్రజల్ని మోసగించారని.. అప్పట్లోనే నిర్ణయం తీసుకుని ఉంటే ఈపాటికి ట్రైబ్యునల్‌ విచారణ పూర్తయి తీర్పు వచ్చేదని, తెలంగాణకు 650 టీఎంసీల వాటా లభించేదని అభిప్రాయపడ్డారు. 2020 అక్టోబరులో జరిగిన అపెక్స్‌ కౌన్సెల్‌లో సుప్రీంలో కేసును ఉపసంహరించుకుంటే ట్రైబ్యునల్‌కు సూచించే అవకాశాల్ని పరిశీలిస్తామని కేంద్ర జలవనరులశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెఖావత్‌ సూచించారని ఆయన గుర్తుచేశారు. 
 Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని