close
అకాల వర్షాలు.. పైర్లలో జాగ్రత్తలు!

న్యూస్‌టుడే, నంద్యాల: తుపాను ప్రభావంతో రాయలసీమలో కురుస్తున్న వర్షాల వల్ల పప్పుశనగ, పత్తి పైర్లకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా పంటలు దెబ్బతినకుండా కాపాడుకోవచ్చని నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకులు డాక్టర్‌ డి.సంపత్‌కుమార్, ప్రధాన శాస్త్రవేత్త డా.వి.జయలక్ష్మీ, సీనియర్‌ శాస్త్రవేత్త ఎస్‌.ఖయ్యుం అహ్మద్, డా.ఎన్‌.కామాక్షి, డా.ఎస్‌.జాఫర్‌బాషా  సూచించారు.  

ఈ చర్యలు చేపట్టాలి   

ఈ దశలో పంటలో శనగపచ్చ పురుగు పూతను, కాయలను  ఆశించి నష్టం కలిగించే అవకాశం ఉంది. ఈ పురుగును గుర్తిస్తే నివారణకు.. 200 లీటర్ల నీటికి క్లోరిపైరిఫాస్‌ అర లీటరు లేదా ఎసిఫేట్‌ 300 గ్రా. లేదా థయోడికార్బ్‌ 300 గ్రా. కలిపి ఎకరా పైరుపై పిచికారి చేయాలి. 

♦ అధిక వర్షాలకు శనగలో ఆకుమాడు, వేరుకుళ్లు తెగుళ్లు ఆశించే ప్రమాదం ఉంది. ఆకుమాడు తెగులు వల్ల ఆకులపై వలయాకారపు మచ్చలు ఏర్పడి క్రమేపి పెరుగుతాయి. దీంతో ఆకులు ఎండి రాలిపోతాయి. నివారణకు.. 200 లీటర్ల నీటిలో హెక్సాకొనజోల్‌ 400 మి.లీ. లేదా ప్రోపికొనజోల్‌ 200 మి.లీ. లేదా క్లోరోథలోనిల్‌ 400 గ్రా. కలిపి ఎకరా పైరుపై పిచికారి చేయాలి. 

వేరుకుళ్లు ఆశిస్తే.. వేర్లు కుళ్లి మొక్క మొత్తం ఎండిపోతుంది. నివారణకు.. లీటరు నీటికి కాపర్‌ఆక్సిక్లోరైడ్‌ 3 గ్రా. చొప్పున కలిపి మొక్కంతా తడిచేలా పిచికారి చేయాలి. ఈ తెగులు వల్ల పొలంలో మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోతాయి. ఈ తెగులు ఇతర మొక్కలకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు.. తెగులు సోకిన మొక్కల చుట్టూ బాగా తడిచేలా మందు ద్రావణాన్ని పిచికారి చేయాలి. 

వర్షాలకు పూత రాలుతుంటే.. వర్షాలు తగ్గాక పైమందులతోపాటు ఎకరాకు ఒక కిలో నీటిలో కరిగే 13-0-45 (పొటాషియం నైట్రేట్‌) లేదా 19:19:19 ఎరువును పైపాటుగా పిచికారి చేయాలి. 


పప్పు  శనగ: ఈ పంట కాయలు ఏర్పడే సమయంలో తేలికపాటి నీటి తడులు ఇవ్వడం వల్ల దిగుబడి గణనీయంగా పెరుగుతుంది. కాని ఎక్కువ వర్షం పడితే పంటకు నష్టం. 30 మి.మీ.కు మించి అధిక వర్షం పడితే పంటకు నష్టం జరిగే ప్రమాదం ఉంది. అయితే తేలికపాటి వర్షాల వల్ల పంటకు నష్టం ఉండదు. 


పత్తిలో.. ఈ పంటలో కాయకుళ్లు, ఆకుమచ్చ తెగుళ్లు ఆశించి నష్టం కలిగించే ప్రమాదం ఉంది. వీటి నివారణకు.. 10 లీటర్ల నీటికి 30 గ్రా. కాపర్‌ ఆక్సీ క్లోరైడ్‌ + ఒక గ్రాము స్ట్రెప్టోమైసిన్‌ లేదా పోషామైసిన్‌ కలిపి పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పైరుపై పిచికారి చేయాలి. ఈ మందులతో బూజుతెగులు, బ్యాక్టీరియా తెగుళ్లు అదుపులో ఉంటాయి. చేలలో నీరు నిల్వకుండా చూడాలి. 

డిసెంబరు, జనవరి మాసాల్లో గులాబిరంగు పురుగు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. ఎకరాకు 4 లింగకార్షక బుట్టలు పెట్టి పురుగు ఉధృతిని గమనించాలి. అవసరమైతే.. లీటరు నీటికి ప్రొఫెనోఫాస్‌ 2.5 మి.లీ. లేదా క్వినాల్‌ఫాస్‌ లేదా క్లోరిపైరిఫాస్‌ 2.5 మి.లీ. లేదా సైపర్‌మెత్రిన్‌ ఒక మి.లీ. కలిపి 15 రోజుల వ్యవధిలో మందులను మార్చి మరోసారి పిచికారి చేయాలి. 

డిసెంబరు, జనవరి మాసాల్లో పత్తి తీసేటప్పుడు.. తేమ లేకుండా జాగ్రత్త వహించాలి. తీసిన పత్తిలో తేమ ఉంటే... గాలి, వెలుతురు ఉండే ప్రదేశంలో బాగా ఆరబెట్టి మూటలు కట్టాలి. ఇలా చేస్తేనే పత్తి నాణ్యత బాగుంటుంది. నాణ్యమైన పత్తికే మార్కెట్లో అధిక ధర లభిస్తుంది.   

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.