close
పాలకూర సాగు!

న్యూస్‌టుడే, హాలహర్వి (కర్నూలు జిల్లా): పాలకూర అధిక పోషక విలువలు కలిగిన ఆకుకూర. ఈ పంట సాగులో పాటించాల్సిన మెలకువలను హాలహర్వి మండల వ్యవసాయాధికారి రూఫస్‌ రొనాల్డ్‌ తెలిపారు. సారవంతమైన, మురుగునీరు ప్రవహించే సౌకర్యం గల నేలలు అనుకూలం. 

రకాలు

ఆల్‌గ్రీన్‌: ఆకులు, కాడలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ప్రతి 15-20 రోజులకు ఒక కోత వస్తుంది. 75 రోజులకు పూత వస్తుంది. ఎకరాకు 6-7 కోతలకు 5 టన్నుల దిగుబడి ఇస్తుంది. 

పూసాజ్యోతి: ఆల్‌గ్రీన్‌ రకాన్ని అభివృద్ధి చేసి దీన్ని రూపొందించారు. ఆకులు మందంగా, పెద్దగా, మృదువుగా ఉంటాయి. ఈ రకం ఆకులను సలాడ్‌గా వాడుతారు. ఎకరాకు 6-8 కోతల్లో 16-19 టన్నుల దిగుబడి వస్తుంది. 

పూసాహరిత్‌: చల్లని, కొండ ప్రాంతాలకు అనువైన రకం. అధిక క్షారతను తట్టుకుంటుంది. 

జాబ్‌నర్‌ గ్రీన్‌: ఆకులు పెద్దగా, మందంగా, మృదువుగా ఉంటాయి. ఎకరానికి 11-12 టన్నుల దిగుబడి వస్తుంది. 

ఊటీ-1: ఆకులు 40-50 సెం.మీ. పొడవు, 8-10 సెం.మీ. వెడల్పు ఉంటాయి. 45 రోజుల్లో మొదటి కోతకు వస్తుంది. 15 రోజులకు ఒక కోత తీసుకోవచ్చు. 4 కోతల్లో ఎకరానికి 24 టన్నుల దిగుబడి వస్తుంది.  

విత్తన మోతాదు: ఎకరానికి 10-12 కిలోలు. 

విత్తే విధానం: ప్రతి పాలకూర గింజ బంతిలో 2-3 విత్తనాలుంటాయి. విత్తనాలను 20 సెం.మీ. దూరంలో, 3-4 సెం.మీ. లోతులో విత్తాలి. 8-10 రోజుల్లో గింజ మొలకెత్తుతుంది.  

విత్తే దూరం: 20×10 సెం.మీ. 

ఎరువులు: పశువుల ఎరువు ఎకరాకు 6-8 టన్నులు వేయాలి. ఆఖరు దుక్కిలో ఎకరాకు 10 కిలోల నత్రజని, 10 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాషియంలను అందించే ఎరువులను వేయాలి.  

అంతరకృషి: విత్తిన 20 రోజుల వ్యవధిలో రెండుసార్లు కలుపుతీసి మట్టిని కదిలించాలి. 

నీటి యాజమాన్యం: విత్తిన వెంటనే నీరు పారించాలి. వారం నుంచి 10 రోజులకోసారి భూమిలో తేమను బట్టి తడులివ్వాలి. ప్రతి కోత తరువాత పైపాటుగా నత్రజని వేసి నీరు పారించాలి. 

సస్యరక్షణ 

ఆకుకూరల పంటకు తక్కువ విషప్రభావం ఉండే పురుగు మందులను మాత్రమే వాడాలి.  

•  పేనుబంక, ఆకుతినే గొంగళి పురుగుల నివారణకు లీటరు నీటికి 2 మి.లీ. మలాథియాన్‌ కలిపి పిచికారీ చేయాలి.  

• ఆకుమచ్చ తెగులు నివారణకు లీటరు నీటికి 3 గ్రా. కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ కలిపి పిచికారీ చేయాలి. 

• పురుగు మందు పిచికారీ చేసిన తర్వాత కనీసం 10 రోజుల వ్యవధి ఇచ్చి ఆకు కోయాలి. 

కోత: మొదటి కోత విత్తిన 3-4 వారాలకు వస్తుంది. తర్వాత 7-10 రోజుల వ్యవధిలో 4-6 కోతలు తీసుకోవచ్చు. 

నిల్వ: శీతల గదిలో నిల్వ చేస్తే.. 2-3 రోజుల వరకు ఆకులు తాజాగా ఉంటాయి. 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.