close
చీని, నిమ్మ కాయల సంరక్షణ!

న్యూస్‌టుడే, ఒంటిమిట్ట

చీని, నిమ్మలో పిందెదశ నుంచి కోతదశ వరకు సోకే చ్కీచీజిడపీడల వల్ల కాయల వృద్ధి, నాణ్యత దెబ్బతింటుంది. పక్వానికి రాకముందే కాయలు రాలిపోతాయి. దీంతో దిగుబడి తగ్గి, రైతులకు నష్టం వాటిల్లుతుంది. సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపడితే మేలైన ఫలితాలు వస్తాయని ఉద్యానశాఖ విశ్రాంత సంయుక్త సంచాలకులు వేంపల్లి లక్ష్మీరెడ్డి తెలిపారు. 

నల్లులు: ఇవి రెండు రకాలు. ఆకుపచ్చ నల్లులు, మంగు నల్లులు. ఇవి చ్కీచీజిని, నిమ్మ కాయలను ఆశిస్తాయి.  

ఆకుపచ్చ నల్లులు: వీటి పిల్ల, పెద్ద నల్లులు ఆకులు, కాయలపై ఉండే నూనె గ్రంథుల చుట్టూ చేరి రసాన్ని పీలుస్తాయి. పిల్ల నల్లుల వల్ల నష్టం అధికంగా ఉంటుంది. ఆకులు, కాయలపై తెల్ల మచ్చలు ఏర్పడతాయి. ఆకులు ఎండుతాయి. కాయల పరిమాణం తగ్గుతుంది. 

మంగు నల్లులు: వేడితో కూడిన తేమ వాతావరణంలో ఇవి ఎక్కువగా వృద్ధి చెందుతాయి. సెప్టెంబరు నుంచి మార్చి వరకు అధికంగా సోకుతాయి. ఈ నల్లులు గోళీ పరిమాణంలో ఉన్న దశ నుంచి కాయల చర్మాన్ని గోకి రసాన్ని పీలుస్తాయి. దీంతో తోలులోని నూనె గ్రంథులు పగిలి, వెలువడిన నూనె తోలు కణజాలాన్ని మాడ్చడం (కాల్చడం) వల్ల తోలుపై గోధుమ లేదా ఊదా రంగు మచ్చలు ఏర్పడుతాయి. ఈ కాయలు సరిగ్గా పెరగవు. మర్కెట్లో ధర పలకవు. 

నివారణ చర్యలు: ఆకుపచ్చ, మంగు నల్లుల నివారణకు ఒకే విధమైన చర్యలు చేపట్టాలి. పిందెలు గోళీ సైజులో ఉన్నప్పటి నుంచి లీటరు నీటికి 3 గ్రా., నీటిలో కరిగే గంధకపు పొడి లేదా 2 మి.లీ. ప్రొపార్‌గైట్‌ లేదా ఇథియాన్‌ లేదా 5 మి.లీ. డైకోఫాల్‌ లీటరు నీటిలో కలిపి నెలకోసారి మందులు మార్చుతూ పిచికారి చేయాలి. నల్లులు సోకకముందే మందులు పిచికారి చేస్తే మంచి ఫలితాలొస్తాయి.  


తొడిమ కుళ్లు: ఇది చీనిలో అంగం కాపును (డిసెంబరు-జనవరిలో వచ్చే పూతనుంచి పెరిగే కాయలు) ఎక్కువగా ఆశిస్తుంది. తొడిమ, కాయ కలిసేచోట తెగులుకారక శిలీంధ్రం వల్ల కుళ్లు ఏర్పడుతుంది. కుళ్లి ఎండిన కాయలు తొడిమలకు అంటుకొని చెట్టుపై చాలాకాలం ఉంటాయి. చెట్టుకున్న ఈ ఎండిన కాయలు తదుపరి పంటలో తెగులు వ్యాప్తికి కారణమవుతాయి.  

నివారణ: చెట్టుపై కుళ్లి ఎండిన కాయల్ని తొడిమలతో సహా కత్తిరించి కాల్చేయాలి. జూన్, జులై, ఆగస్టు నెలల్లో నెలకోసారి లీటరు నీటికి ఒక గ్రాము కార్బండిజమ్‌ కలిపిన ద్రావణాన్ని ఆకులు, కాయలు బాగా తడిచేలా పిచికారీ చేయాలి.


రసంపీల్చే రెక్కల పురుగులు: ఇవి చీని కాయలు, పండ్ల నుంచి రసాన్ని పీలుస్తాయి. పురుగులు గతంలో కాయల తోలు పసుపు రంగుకు మారి పక్వానికి వచ్చే సమయంలో కాయలు, పండ్ల నుంచి రసాన్ని పీల్చి నష్టపరిచేవి. వీటి బెడదను తప్పించుకునేందుకు కాయలు పక్వ దశకు చేరకముందే కోసేవారు. రెండు, మూడేళ్ల నుంచి లేతాకుపచ్చ రంగు దశలో ఉన్న కాయల నుంచి కూడా ఈ పురుగులు రసాన్ని పీల్చి నష్టపరుస్తున్నాయి. దీన్ని కొన్ని ప్రాంతాల్లో ‘డాగు’ కొట్టడమంటారు. ఈ పురుగులు రాత్రిపూట మాత్రమే సంచరిస్తాయి. ఇవి చేసే రంధ్రాల ద్వారా శిలీంధ్రాలు, బ్యాక్టీరియా ప్రవేశించి, ఆ ప్రదేశం మెత్తబడి కుళ్లుతుంది. దీంతో కాయలు, పండ్లు పసుపు రంగుకు మారి వారం వ్యవధిలోనే మాగకముందే రాలిపోతాయి. సాధారణంగా అంగం కాపునకు జులై, ఆగస్టు నెలల నుంచి వీటి బెడద ఎక్కువగా ఉంటుంది. రెక్కల పురుగులు పెద్దవిగా, దృఢంగా బాగా వృద్ధి చెందిన తొండంతో, అందమైన రంగుల రెక్కలతో ఉంటాయి. పిల్ల పురుగులు (లార్వాలు) తోటల్లో, తోటల చుట్టూ ఉండే తిప్ప, కట్ల తీగలు, ముసిడి, ఆముదం, దానిమ్మ చెట్లపై వృద్ధి చెందుతాయి. రెక్కల పురుగులు ఎక్కువగా కింది కొమ్మలపై ఉండే కాయలను ఇష్టపడతాయి. 

నివారణ: కాయలు పూర్తిగా పక్వానికి రాకముందే కోయాలి. తోటల్లో, తోటల చుట్టూ పెరిగే తిప్ప, దూసరి, ఆముదం మొక్కలను తొలగించాలి. 300 మెష్‌ పాలిథీన్‌ లేదా బట్టర్‌ పేపరు సంచులను కాయలకు తొడగాలి. రాలిన కాయల్ని రెండు భాగాలుగా కోసి చెట్ల పాదుల్లో వేయాలి. ఈ పురుగుల్ని వలలతో పట్టి చంపాలి. లీటరు నీటికి.. అర కిలో బెల్లం, 5 మి.లీ. వెనిగర్, 3 మి.లీ., మలాథియాన్‌ కలిపి తయారు చేసిన ఎరమందు ద్రావణాన్ని మూతి వెడల్పుగా ఉండే సీసాలో పోసి తోటల్లో అక్కడక్కడ చెట్లకు వేలాడదీస్తే పురుగులు ఈ విష ద్రావణాన్ని తాగి చనిపోతాయి. రాత్రిపూట తోటలో పొగబెడితే రెక్కల పురుగులు తోటలోకి రావు. 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.