close
అంతరపంటగా ఆగాకర!

న్యూస్‌టుడే, నరసరావుపేట/(గ్రామీణ): వ్యవసాయంవైపు అడుగేసిన ఒక యువ విద్యావంతుడు సరికొత్త ఆలోచనలతో పంటలను సాగుచేస్తూ సత్ఫలితాలను సాధిస్తున్నాడు. తక్కువ పెట్టుబడితో అధికాదాయం పొందుతున్నాడు. అటవీ ప్రాంతంలో సహజసిద్ధంగా పెరిగే ఆగాకర (అడవి కాకర) విత్తనాలను తెచ్చి, యాపిల్‌బెర్‌ పంటలో అంతరపంటగా సాగు చేస్తున్నాడు. తన చేలోని కాయల నుంచే విత్తనాన్ని సేకరించి రైతులకు విక్రయిస్తున్నాడు. దీంతో రెండు విధాలుగా.. పంట, విత్తనం అమ్మకం ద్వారా ఆదాయం పొందుతున్నాడు. సేంద్రియ పద్ధతిలో సాగుచేస్తూ నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఉత్పత్తులను వినియోగదారులకు అందిస్తున్నాడు. నేటి యువతరానికి.. వ్యవసాయం చక్కని ఉపాధి మార్గమని నిరూపిస్తున్నాడు. ఈ యువరైతు సాగు తీరుతెన్నుల వివరాలు.. 

వ్యవసాయం వైపు అడుగులు.. 

గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పమిడిమర్రు గ్రామానికి చెందిన చ్కీచీజిరాల యామలయ్య వ్యవసాయ కుటుంబానికి చెందిన వారు. పోస్టు గ్రాడ్యుయేషన్‌ విద్యను అభ్యసించారు. ప్రైవేట్‌ సంస్థల్లో కొన్నాళ్లపాటు ఉద్యోగాలు చేశారు. ఇవేవి తనకు సంతృప్తినివ్వలేదు. దీంతో వ్యవసాయం వైపు కదిలారు. తనకున్న మూడు ఎకరాల పొలంలో రెండు ఎకరాల్లో యాపిల్‌బెర్‌ సాగు చేశారు. ఉద్యానశాఖ ఈ పంటకు రాయితీలు ఇవ్వటంతో అనేక మంది రైతులు ఈ పంట సాగు చేపట్టారు. దీంతో ఉత్పత్తి పెరిగి, డిమాండ్‌ తగ్గిపోయింది. ఈ పరిస్థితిని అధిగమించే మార్గాలను యామలయ్య అన్వేషించారు. అంతర పంటగా గోరు చిక్కుళ్లు సాగు చేశారు. వీటి అమ్మకం అంతంత మాత్రంగానే ఉండటంతో డిమాండ్‌ ఉన్న కూరగాయల గురించి ఆరా తీశారు. అంతర్జాలంలో వెతికారు. ఆగాకర కూరగాయల సాగు గురించి తెలుసుకున్నారు. భద్రాచలం ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లి విత్తనాలను తీసుకొచ్చారు. గతేడాది 30 సెంట్లలో ఈ పంట వేశారు. ఈ ఏడాది పంట విస్తీర్ణాన్ని  ఎకరానికి పెంచారు. 

సేంద్రియ పద్ధతిలో.. 

సాగులో ప్రకృతి వ్యవసాయ విధానాన్ని ఆచరిస్తున్నారు. సేంద్రియ ఎరువులను వినియోగిస్తూ నాణ్యమైన దిగుబడులను తీస్తున్నారు. పంటలు ఏపుగా పెరిగేందుకు, తెగుళ్లను తట్టుకునేందుకు.. ఘన, ద్రవ చ్కీజీజివామృతాలను, నీమాస్త్రం, అగ్ని అస్త్రం వంటివి తానే స్వయంగా తయారు చేసి పంటలకు వినియోగిస్తున్నారు. నీటిపారుదలకు బిందుసేద్య పరికరాలను అమర్చి, తక్కువ నీటితోనే మేలైన దిగుబడులు తీస్తున్నారు. 

నాలుగు నెలల పాటు దిగుబడులు 

పంట వేసిన 75 రోజులకు తొలి దిగుబడి వస్తుంది. మొదటి కోతకు 15 కిలోల దిగుబడి రాగా, రెండో కోతకు 25 కిలోలు చొప్పున.. ఇలా ప్రతి కోతకు ఐదు కిలోలు చొప్పున దిగుబడి పెరుగుతుంది. ఏడాదిలో నాలుగు నెలల పాటు దిగుబడులు వస్తాయి. వారానికి ఒక కోత కోయవచ్చు. ఈ లెక్కన ఏడాదికి ఎకరంలో పది క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. మార్కెట్‌లో కిలో కూరగాయల ధర రూ.100 ఉంది. యాపిల్‌బెర్, ఆగాకర రెండు పంటల మీద ఏడాదికి ఖర్చులు పోను రూ.2 లక్షల వరకు ఆదాయం పొందారు. ఆగాకర విత్తనాలను కిలో రూ.మూడు వేలు చొప్పున విక్రయిస్తున్నారు. వీటి అమ్మకం ద్వారా మరో రూ.3 లక్షల వరకు ఆదాయం సమకూరిందని రైతు పేర్కొన్నారు. 

తక్కువ పెట్టుబడితోనే .. 

ఆగాకర తీగజాతి పంట. పందిర్లపై దీన్ని సాగు చేయాల్సి ఉంటుంది. నేలపై పాకిస్తే దిగుబడి రాదు. పందిర్లు ఏర్పాటు చేయాలంటే ఖర్చుతో కూడుకున్న పని. అప్పటికే తన చేలో అడవిలా పెరిగిన యాపిల్‌బెర్‌ చెట్లను ఆగాకర సాగుకు ఉపయోగించుకున్నారు. దీంతో పందిరి ఏర్పాటుకయ్యే వ్యయ ప్రయాసలు తప్పాయి. యాపిల్‌బెర్‌ పూత దశకు వచ్చే సమయానికి ఆగాకర పంట దిగుబడులు చేతికి వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవటంతో రెండు పంటల ద్వారా ఆదాయం పొందగలుగుతున్నారు. పందిరిపై తీగలను అల్లించినప్పుడు కాయలు కిందకు వేలాడతాయి కాబట్టి ప్రతి కాయను కోసేందుకు వీలవుతుంది. ఇక్కడ పండ్ల చెట్లపైకి తీగలను పాకించటం వల్ల కొన్ని కాయలు కనిపించకపోవటం, అందకపోవటం వల్ల పండిపోతుంటాయి. వీటి నుంచి విత్తనాలను సేకరించి రైతులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. కాయలు అమ్మకం ద్వారా కన్నా విత్తనోత్పత్తి ద్వారా అధిక లాభం రావటం విశేషం. కూరగాయలను తానే స్వయంగా ద్విచక్ర వాహనంపై మార్కెట్‌కు తీసుకెళుతుంటారు. తద్వారా రవాణా ఖర్చును తగ్గించుకోగలుగుతున్నారు. 

సాగు సంతృప్తినిస్తోంది : యామలయ్య, రైతు, పమిడిమర్రు 

గతంలో ప్రైవేట్‌ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఏదో తెలియని అసంతృప్తి  ఉండేది. సాగు మొదలు పెట్టాక చాలా సంతృప్తిగా ఉంది. పది మందికి ఉపాధి చూపించగలుగుతున్నాను. ఆగాకరలో అనేక ఔషధ గుణాలు, పోషకాలు ఉండటంతో వీటి వినియోగం పెరిగింది. పూర్తిగా సేంద్రియ పద్ధతిలో పంటల సాగుచేపట్టడం ద్వారా వినియోగదార్లకు మేలైన ఉత్పత్తులను ఆందించడం ఆనందంగా ఉంది. 

ఆగాకర లాభసాటి పంట:  డి.నవీన్‌కుమార్, ఉద్యానాధికారి, నరసరావుపేట 

గుంటూరు జిల్లాలో ఈ రైతు తొలిసారిగా ఆగాకర సాగు చేశారు. ప్రకాశం చ్కీజిజిల్లాలో నాలుగైదు గ్రామాల్లో ఈ పంటను సాగు చేస్తున్నారు. ఇందులో ఔషధ గుణాలు అధికం. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది బాగా ఉపయోగపడుతుంది. మామూలు కాకరకాయలు కిలో ధర రూ.15 ఉంటే, ఆగాకర రూ.80 నుంచి 100 ధర పలుకుతుంది. మున్ముందు ఈ పంట సాగు మరింత పెరిగే అవకాశం ఉంది. 

 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.