close
రైతులపై రుణభారం!
భారత్‌ వ్యవసాయ దేశం. వివిధ రాష్ట్రాల్లో నెలకొన్న విభిన్న వాతావరణ మార్పులు ఈ దేశానికి వరం. దక్షిణ భారతంలో వర్షాభావ పరిస్థితులుంటే, ఉత్తర భారతంలో వర్షాలు, వరదలుంటాయి. ఉత్తరాన అధిక చలి ఉంటే, దక్షిణాన సాధారణ పరిస్థితులు ఉంటాయి. తూర్పున శీతల గాలులు, పడమర వేడిగాలులు, ఇలా వైవిధ్యం ఉన్న వాతావరణం దేశానికి సొంతం. అందువల్లే ఈ దేశంలో ఎక్కువ రకాల పంటలను పండించవచ్చు. కోట్ల కొద్ది పశుసంపద, అధిక జనసాంద్రత ఉన్న ప్రాంతం కావడంతో.. యాంత్రిక వ్యవసాయం పెద్దగా లేక, మానవశక్తిని ఎక్కువగా ఉపయోగించుకుంటున్నాం. అందువల్ల వ్యవసాయ ఖర్చులు పెరుగుతున్నాయి. సరైన మార్కెటింగ్‌ వ్యవస్థ లేక, గిట్టుబాటు ధరలు లభించక, రుణగ్రస్తమైన వ్యవసాయ కుటుంబాల సంఖ్య పెరుగుతోంది. 

జాతీయ శాంపిల్‌ సర్వే ప్రకారం.. గ్రామీణ కుటుంబాల సంఖ్య ఆంధ్రప్రదేశ్‌లో 86,763 కాగా తెలంగాణలో 49,309. వీటిలో వ్యవసాయాధారిత కుటుంబాలు ఆంధ్రప్రదేశ్‌లో 35,969 (41.5 శాతం) ఉండగా.. తెలంగాణలో 25,389 (51.5 శాతం) ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, బీహార్, మహారాష్ట్రలో గ్రామీణ ఆవాసాల్లో వ్యవసాయం వృత్తిగా ఉన్న గృహాలు తక్కువే. రుణభారం మోస్తున్న వ్యవసాయ గృహాలు దేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్‌లోనే అధికం. తరువాతి స్థానం తెలంగాణది. రుణభారం మోస్తున్న రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల తరువాత స్థానాల్లో తమిళనాడు, కేరళ, కర్ణాటక ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాలు చిన్నవైనా తక్కువ రుణగ్రస్త రాష్ట్రాలుగా నమోదయ్యాయి.  

సాగుకొద్దీ అప్పులు.. 

‘ఎంత చెట్టుకు.. అంత గాలి’ అనే సూక్తి మనదేశ వ్యవసాయ రంగానికి అతికినట్టు సరిపోతుంది. వ్యవసాయ భూమి పెరిగిన కొద్ది రుణగ్రస్తత పెరిగి, ఖర్చులు పెరుగుతున్నాయి. 3 ఎకరాల్లోపు భూవసతి గల సన్నకారు రైతులకు సగటు రుణభారం 55 వేలు కాగా, 25 ఎకరాలు అంతకంటే ఎక్కువ భూమి గల రైతుల సగటు రుణభారం రూ.3 లక్షలు. వ్యవసాయంతో పాటు, పశుపోషణ చేపడుతున్న రైతులకు రుణభారం కొంత తగ్గుతోంది. దేశంలో 30 కోట్ల పశువులున్నాయి. వీటిలో.. ఆవుజాతి పశువులు 19 కోట్లు, గేదె జాతి పశువులు 11 కోట్లు. మేకలు, గొర్రెలు 20 కోట్లు, 73 కోట్ల కోళ్ళున్నాయి. ఇవి ఎక్కువగా గ్రామీణ రైతుల ఆధీనంలోనివే. 16.4 కోట్ల టన్నుల పాలు, 8800 కోట్ల గుడ్లు ఈ రంగం నుంచి లభిస్తున్నాయి. పశుపోషణలో హర్యానా, పంజాబ్‌ రాష్ట్రాలు ముందున్నాయి. గొడ్డు మాంసం ఎగుమతిలో దేశం ముందంజలో ఉంది. 

మార్కెట్‌ సౌకర్యాల లేమి.. అవకాశాలు ఎన్ని ఉన్నా రైతులకు రుణాలు, కడగండ్లు తప్పడం లేదు. పంట దిగుబడులు, మార్కెట్‌ సౌకర్యాలు, గిట్టుబాటు ధరలు, ఎగుమతులు మెరుగైతేనే తప్ప రైతులు రుణ విముక్తులు కాలేరు. ఈ విషయంలో దేశం ముందడుగు వేసినప్పుడే.. రైతుల్లో ఆనందం కనిపిస్తుంది.  

- డాక్టర్‌ మొవ్వ రామారావు 


 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.