close
పశువుల్లో ముద్ద చర్మవ్యాధి

అప్రమత్తత అవసరమంటున్న పశువైద్యులు

పాడి పశువుల్లో ప్రబలుతున్న  ముద్ద చర్మవ్యాధి (సుడోలాంపీ స్కిన్‌ డిసీజ్‌)  పశుపోషకులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇది వైరస్‌ వ్యాధి. ప్రస్తుతం మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని పశువుల్లో ఈ వ్యాధి లక్షణాలను గుర్తించారు. ఈ వ్యాధి బారినపడిన పశువులకు ఇటీవలే గరివిడి పశువైద్య కళాశాలలో చికిత్సలు చేశారు. ఈ నేపథ్యంలో.. ముద్ద చర్మవ్యాధి వ్యాప్తికి కారణాలు, వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలను గరివిడి పశువైద్య కళాశాల అసోసియేట్‌ డీన్‌ గుంట్రెడ్డి వెంకటనాయుడు రైతేరాజుకు తెలిపారు. 

న్యూస్‌టుడే, గరివిడి: ఈ వైరస్‌ వ్యాధి కేవలం పశువుల్లో మాత్రమే వ్యాపిస్తుంది. గాలి ద్వారా, దోమకాటు ద్వారా వైరస్‌ పశువుల శరీరంలోకి ప్రవేశిస్తుంది. వ్యాధి సోకిన పశువులను తాకిన మనుషులకు ఎలాంటి ప్రమాదం ఉండదు. ఇది ప్రాణాంతకం కాకపోయినప్పటికీ.. పశువుల్లో పాల ఉత్పత్తిని, పునరుత్పత్తిని దెబ్బతీస్తుంది. 

వ్యాధి లక్షణాలు: పశువు చర్మంపై కణతలు కనిపిస్తాయి. ప్రారంభంలో మెడ చుట్టూ కనిపించే కణతలు క్రమంగా శరీరమంతా విస్తరిస్తాయి. పొదుగు, జననేంద్రియాలు, కాళ్లు, తోకవరకు వ్యాపిస్తాయి. చర్మం చిట్లిపోయి రక్తస్రావం జరుగుతుంది. 

* వ్యాధి సోకిన పశువు 102-104 డిగ్రీల జ్వరంతో బాధపడుతుంది. 

* కణతలతో పాటు కండ్ల కలక, కంటి నుంచి నీరు కారడం, నోటి నుంచి చొంగ కారడం కనిపిస్తాయి. 

* కాళ్లు వాచిపోతాయి. కాళ్లపై చర్మం ఊడిపోయి రక్తస్రావం జరుగుతుంది. 

* పశువు బక్కచిక్కి నీరసిస్తుంది. మేత మేయడం తగ్గి, బరువు క్షీణిస్తుంది. 

* ఈ వ్యాధి దేశవాళి పశువుల కంటే సంకరజాతి పశువుల్లోనే ఎక్కువగా వ్యాపిస్తుంది. వ్యాధి తీవ్రత అన్ని పశువుల్లో ఒకే విధంగా ఉండదు. కొన్ని పశువుల్లోనూ తీవ్రంగాను, మరి కొన్ని పశువుల్లో మధ్యస్తంగా ఉంటుంది. 

* వ్యాధి బారిన పడిన పశువుల్లో పాల దిగుబడి తగ్గిపోతుంది. చూడి పశువుల్లో రక్తస్రావం జరుగుతుంది. వ్యవసాయ పనిచేసే పశువులు సామర్థ్యం కోల్పోతాయి. 

* వ్యాధి సోకిన పశువులు నెలల తరబడి బలహీనపడి ఉంటాయి. పునరుత్పత్తిలో సమస్యలుంటాయి.  

* ఈ వ్యాధి ఉధృతంగా వ్యాప్తి చెందినప్పటికీ మరణాల ప్రమాదం ఉండదు. అయితే.. ఈ వ్యాధితో పాటు మరేదైనా వ్యాధి శరీరంలో అంతర్గతంగా ఉన్న సందర్భాల్లో కొన్ని పశువుల్లో మరణాలు సంభవిస్తాయి. దీంతో  రైతులకు పెద్ద మొత్తంలో ఆర్థిక నష్టం    కలుగుతుంది. 

చికిత్స: ఈ వ్యాధి చికిత్సకు నిర్ధిష్ట యాంటీవైరల్‌ మందు అందుబాటులో లేదు. ద్వితీయ బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్లను నివారించడానికి యాంటీ బయాటిక్స్‌ ఇవ్వడం ద్వారా పశువులు త్వరగా కోలుకునేలా చేయవచ్చు. 

* నొప్పిని తగ్గించి పశువు ఆకలిని పెంచడానికి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మందులు ఇవ్వాలి.  

* జ్వరంతో బాధపడుతున్న పశువు శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి, కణుతులు చ్కీచీజిము పట్టకుండా ఉండేందుకు, కండరాల నొప్పులు తగ్గించడానికి యాంటీ బయాటిక్స్‌తో పాటు తగిన మందులతో చికిత్స చేయాలి.  

 నివారణ చర్యలు 

* ఈ వ్యాధి సోకిన పశువులను మిగతా పశువులకు దూరంగా ఉంచాలి. వ్యాధిగ్రస్త పశువు నుంచి దూడలకు పాలు పట్టకూడదు. ఈ వ్యాధి సోకిన ఎద్దుల వీర్యంలోనూ వైరస్‌ ఉంటుంది. కాబట్టి ఈ ఎద్దులతో ఆవులను సంకర పరచకూడదు. 

* దోమకాటు మూలంగా వ్యాధి వస్తుంది కాబట్టి పశువుల కొట్టాల్లో దోమలు లేకుండా చర్యలు చేపట్టాలి. వేపాకు, కర్పూరంతో పొగ పెట్టాలి. మురుగునీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలి. 

* కొట్టాల్లో దోమ తెరలను వాడి, దోమ కాటును అరికట్టవచ్చు. 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.