close
పశువుల్లో పాల జ్వరం!

న్యూస్‌టుడే, ఖమ్మం (రోటరీనగర్‌)

పాల జ్వరం పశువుల ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది. దీన్ని చలిజ్వరం అని కూడా అంటారు. ఈ వ్యాధి ముఖ్యంగా అధికంగా పాలిచ్చే పశువుల్లో కనిపిస్తుంది. ఈ వ్యాధి బారిన పడిన పశువుల్లో పాల దిగుబడి గణనీయంగా పడిపోతుంది. వ్యాధి తీవ్రంగా ఉంటే పశువు ప్రాణాలకు సైతం ముప్పు ఏర్పడుతుంది.

వ్యాధి లక్షణాలు
వ్యాధికి గురైన పశువుల్లో శరీర ఉష్ణోగ్రత బాగా పడిపోతుంది. 96 నుంచి 94 డిగ్రీల ఫారన్‌ హీట్ వరకు ఉష్ణోగ్రత తగ్గడంతో శరీరం చల్లగా, తడిగా మారుతుంది. అధిక చలి వల్ల పశువుల్లో వణుకు ఉంటుంది. నోటి నుంచి కటకటమని శబ్దం వస్తుంది. పాలు నిల్వ ఉండి పొదుగు బరువుగా కనిపిస్తుంది. మేత మేయవు. కళ్లు మూతలుపడి మత్తుగా పడి ఉంటుంది. మెడ డొక్కలో పెట్టుకుని ముడుచుకుని పడుకుంటుంది. కళ్లు లోపలకు పీక్కుపోయి, కళ్ల వెంట నీరు కారుతుంది. చర్మం నూగుబారిపోయి నీరు, మేత ముట్టుకోదు. పాలజ్వరం సహజంగా పశువు ఈనిన 48 నుంచి 72 గంటల తరువాత వస్తుంది. ఈ పశువుల్లో గర్భాశయం బయటకు రావడం, మాయ వేయకపోవడం, గర్భాశయం తిరగబడటంతోపాటు, పొదుగు వాపు వ్యాధి వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. వ్యాధి చివరి దశలో పశువు స్పృహ కోల్పోయి కోమాలోకి పోతుంది. కండరాలన్నీ పక్షవాతం లక్షణాలతో పనిచేయవు. వైద్యం సకాలంలో అందకపోతే పశువు మృత్యువాత పడుతుంది.

ముందస్తు జాగ్రత్తలు
నిండు చూలుతో ఉన్న కాలంలో పశువు తీసుకున్న ఆహారంలో కాల్షియం సరిపడినంత లేనప్పుడు- ఈనిన తర్వాత.. అధిక పాలనిచ్చే పశువుల్లో పాల జ్వరం వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ పశువులకు పాలిచ్చే కాలంలో దాణాలో సరైన పాళ్లలో కాల్షియం, ఫాస్ఫరస్‌ ధాతువులు ఉండేలా చర్యలు చేపట్టాలి. అందించే మేతల్లో ఎండు, పచ్చిగడ్డిల నిష్పత్తి సరిపడా ఉండేలా చూడాలి. సూక్ష్మ, స్థూల పోషకాలు సమపాళ్లలో ఉండేలా దాణా మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. గతంలో ఈనిన ఈతల చరిత్ర తెలుసుకుని పశువైద్యుని పర్యవేక్షణలో మందులు, ఇంజక్షన్‌లు అందించాలి.

చికిత్స
* పశువు ఈనిన మొదటి, రెండో రోజు పాల జ్వరం లక్షణాలు కనిపిస్తే.. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
* కాల్షియం బోరో గ్లూకోనేట్ ఇంజక్షన్‌ 500 మి.లీ. వరకు రక్తంలోకి ఉదయం, సాయంత్రం ఎక్కించాలి.
* శరీరంలో కాల్షియం తయారయ్యేందుకు.. కాల్షియం ఫాస్ఫరస్‌ ఇంజక్షన్‌ను కండకు ఇవ్వాలి.
* సరైన మోతాదులో నాణ్యమైన దాణా అందించాలి.
* మెగ్నీషియం ధాతువు కలిసిన లవణ జలాన్ని రక్తంలోకి ఎక్కించాలి.


పాడి పశువుల ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలి
డాక్టర్‌ కిశోర్‌, పశుసంవర్థకశాఖ సహాయ సంచాలకులు, ఖమ్మం

పెంపకందార్లు పశువు ఈనిన సమయంలో అప్రమత్తంగా ఉండాలి. చూడి సమయంలో సరైన పోషకాలు కలిగిన ఆహారం అందించాలి. పాలజ్వరం పశువును, పెంపకందారును తీవ్రంగా నష్టపరుస్తుంది. వ్యాధి లక్షణాలపై అవగాహన పెంచుకుని, సకాలంలో వైద్యం అందేలా చూడాలి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.