close
వేరుసెనగలో చీడపీడల అదుపు

న్యూస్‌టుడే, జగిత్యాల (వ్యవసాయం)

నూనెగింజల పంటల్లో వేరుసెనగ ప్రధానమైనది. రబీలో విత్తిన వేరుశనగలో ప్రస్తుతం చేపట్టాల్సిన చర్యలను జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త పి.గోన్యానాయక్‌ వివరించారు.

విత్తిన నెల రోజులకు పైపాటుగా ఎకరాకు 10 కిలోల యూరియా వేయాలి. 200 కిలోల జిప్సంను ఊడలుదిగే సమయంలో మొక్కల మొదళ్లవద్ద ఒక సెం.మీ. లోతులో వేసి మట్టిని ఎగదోయాలి. జిప్సంలోని కాల్షియం కాయలు బాగా ఊరడానికి, గంధకం గింజల్లో నూనెశాతం పెంపునకు దోహదపడుతుంది. జింకు సల్ఫేటును 3 పంటలకోసారి వేయాలి. పైరుపై జింకు లోపించినప్పుడు ఆకులు చిన్నవిగా మారి గుబురుగా కనిపిస్తాయి. మొక్కలు పసుపు రంగుకు మారతాయి. లోప సవరణకు.. ఎకరాకు 400 గ్రా., జింక్‌సల్ఫేట్‌ను 200 లీటర్ల నీటికి కలిపి వారం వ్యవధితో రెండుసార్లు పిచికారి చేయాలి.

* రబీలో ఇనుపధాతు లోపం ఎక్కువగా కనిపిస్తుంది. నల్లరేగడి నేలల్లో అధిక తేమవల్ల కూడా ఇనుము లోపిస్తుంది. దీంతో లేతాకులు పసుపు పచ్చగానూ తర్వాత తెల్లగా మారతాయి. ఈ లోప సవరణకు.. కిలో అన్నభేది, 200 గ్రా. సిట్రిక్‌ ఆమ్లాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి వారం వ్యవధితో రెండుసార్లు పిచికారి చేయాలి.
* పైరు ఏమాత్రం నీటిఎద్దడికి గురికాకుండా చూడాలి. అధిక నీరు కూడా పారించకూడదు. పంటకాలంలో 8-9 తడులను వాతావరణ పరిస్థితులను బట్టి ఇవ్వాలి. నేలనుబట్టి 7-12 రోజులకు ఒక తడివ్వాలి. ఊడలు దిగే దశనుంచి కాయ గట్టిపడే వరకు నీటిఎద్దడి లేకుండా చూడాలి. పంట విత్తిన 45 రోజుల వరకు తోటలో కలుపు లేకుండా చూడాలి. సరైన సమయంలో కలుపు తీయకుంటే దిగుబడి 45 శాతం వరకు తగ్గుతుంది.
* లేతదశలో తామర పురుగులు, పచ్చదోమ, పేనుబంక, ఆకుముడత ఆశిస్తాయి. వీటి నివారణకు లీటరు నీటికి మోనోక్రోటోఫాస్‌ 1.6 మి.లీ. లేదా ఎసిఫేట్‌ 1.5 గ్రాము వంతున కలిపి పిచికారి చేయాలి. పొగాకు లద్దెపురుగు, శనగపచ్చ పురుగుల ఉనికిని గుర్తించడానికి ఎకరాకు 4 లింగాకర్షణ బుట్టలను ఏర్పాటు చేయాలి. పంటకు అడుగు ఎత్తులో ఎకరాకు 20 పంగల కర్రలను పాతాలి. వీటిపై వాలిన పక్షులు    పురుగులను ఏరుకుని తింటాయి. గుడ్లు, చిన్న  లద్దెపురుగుల సముదాయాలను ఆకులతో సహా ఏరి కాల్చివేయాలి. లీటరు నీటికి 50 మి.లీ. వేపగింజల కషాయం పైరుపై పిచికారి చేయాలి. లీటరు నీటికి క్లోరిఫైరిఫాస్‌ 2.5 మి.లీ. లేదా క్వినాల్‌ఫాస్‌ 2 మి.లీ. వంతున కలిపి పిచికారి చేయాలి. 


బోరాన్‌ లోపిస్తే..

చివరి మొగ్గాకు దెబ్బతింటుంది. కాయలకు పగుళ్లు ఏర్పడతాయి. బోరాన్‌ లోప సవరణకు.. లీటరు నీటికి 2 గ్రా. బోరాక్స్‌ వంతున కలుపుకుని పైరుపై పిచికారి చేయాలి. 


లద్దెపురుగుల నివారణకు..

పంటచుట్టూ నాగలితో సాలువేసి, అందులో మిథైల్‌ పెరాథియాన్‌ పొడి చల్లి పురుగుల వలసను నివారించాలి. మూడోదశ లద్దెపురుగుల నివారణకు.. లీటరు నీటికి థయోడికార్బ్‌ ఒక గ్రాము లేదా నొవాల్యురాన్‌ ఒక మి.లీ. కలిపి పిచికారి చేయాలి. బాగా ఎదిగిన లద్దెపురుగుల నివారణకు విషపు ఎరలను వాడాలి. 10 కిలోల తవుడు, 2 కిలోల బెల్లం, అర లీటరు క్ల్లోరిపైరిఫాస్‌లను ఐదు లీటర్ల నీటిలో కలిపి ఉండలుగా చేసి సాయంత్రం వేళ మొక్కల మధ్య వేయాలి. వీటిని తిన్న పురుగులు చనిపోతాయి. 


ఆకుమచ్చ, తుప్పు తెగుళ్లు..

నివారణకు.. లీటరు నీటికి 2.5 గ్రా. మాంకోజెబ్‌ లేదా ఒక గ్రాము కార్బండిజం కలిపి విత్తిన 45 రోజుల నుంచి 10-15 రోజుల వ్యవధితో రెండు, మూడుసార్లు పైరుపై పిచికారి చేయాలి. మొదలుకుళ్లు ఆశించిన మొక్కలను పీకి కాల్చివేయాలి. నివారణకు.. లీటరు నీటికి 2 గ్రాముల మాంకోజెబ్‌ వంతున కలిపిన ద్రావణంతో మొక్కల మొదళ్లను తడపాలి. వేరుకుళ్లు సోకిన పొలంలో లీటరు నీటికి కార్బండజిం 1 గ్రాము చొప్పున కలిపిన ద్రావణంతో మొదళ్ల వద్ద నేలను బాగా తడపాలి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.