close
రైతులకు వరం.. వరి నాటే యంత్రం!

సమయం, ఖర్చు  ఆదా
కూలీల కొరతకు పరిష్కారం
న్యూస్‌టుడే, ఖమ్మం (వ్యవసాయం)

వ్యవసాయంలో వస్తున్న సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకుని తెలుగు రాష్ట్రాల్లోని రైతులు గణనీయమైన ప్రగతిని సాధిస్తున్నారు. వరి నాటే యంత్రాలను ఉపయోగించి కొంతమంది రైతులు అధిక దిగుబడులు సాధిస్తున్నారని ఖమ్మం ఏరువాక కేంద్రం డాట్‌సెంటర్‌ సమన్వయకర్త డాక్టర్‌ ఆర్‌.శ్రీనివాసరావు తెలిపారు.
* వరి సాగులో కూలీల అవసరం అధికంగా ఉంటుంది. కూలీల కొరత ఉన్న ప్రాంతాల్లో.. అదునులో నాట్లు వేయకపోవటం వల్ల నారు ముదిరిపోయి, పిలకల సంఖ్య తగ్గి, దిగుబడులు క్షీణిస్తున్నాయి.
* కూలీలతో నాట్లు వేసినప్పుడు.. చాలా సందర్భాల్లో పొలంలో సరైన సాంద్రతలో మొక్కల సంఖ్య ఉండదు. చదరపు మీటరుకు తక్కువ కుదుర్లు ఉండటం దిగుబడులపై ప్రభావం చూపుతోంది.

వరి నాటే యంత్రాలు
* వరినాటే యంత్రాలతో 4, 6, 8 వరుసల్లో ఒకేసారి మొక్కలను నాటవచ్చు. మన రాష్ట్రంలో 4, 6 వరుసల్లో నాటే యంత్రాలను ఎక్కువగా వాడుతున్నారు.
* యాన్మార్‌, కుబోటా యంత్రాలు అన్ని కాలాల్లో, అన్ని ప్రాంతాల రైతులకు ఉపయోగకరంగా ఉండి,  రైతుల ఆదరణ పొందాయి.
* వీటిలో మనిషి కూర్చొని నడిపేవి, మనిషి నడుస్తూ నాటు వేసే రకాలున్నాయి.

నారు పెంచే విధానం
* యంత్రాలతో నాట్లు వేసేందుకు ముందుగా నారును ట్రేలలో పెంచాల్సి ఉంటుంది.
* ఈ పద్ధతిలో 16 రోజుల్లోనే వరి నారు నాటేందుకు సిద్ధమవుతుంది.
* ఎకరానికి దాదాపు 60-80 ట్రేల నారు అవసరం.
* ట్రేలలో పెంచేందుకు.. ఎకరానికి 12-15 కిలోల విత్తనం కావాలి. అదే సాధారణ పద్ధతిలో అయితే 25-30 కిలోలు అవసరమవుతుంది.

యంత్రాల ధర, సామర్థ్యం
* రూ.2.75 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు యంత్రాలు అందుబాటులో ఉన్నాయి.
* రోజుకు ఒక యంత్రంతో దాదాపు 4 నుంచి 5 ఎకరాల్లో వరి నాటవచ్చు. ఇందుకు ఇద్దరు మనుషులు అవసరమవుతారు.
* ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 3 నుంచి 3.5 వేల హెక్టార్లలో యంత్రాలతో వరి సాగు చేస్తున్నారు.
* సత్తుపల్లి, చర్ల మండలాల్లోనే దాదాపు వెయ్యికి పైగా హెక్టార్లలో ఈ పద్ధతిలో వరి సాగులో ఉండటం విశేషం.

ఉపయోగాలు
* సాధారణ పద్ధతిలో 30-35 రోజుల దశలో ఉన్న నారును నాటడం వల్ల దుబ్బులో పిలకల సంఖ్య తక్కువగా ఉంటుంది. యంత్రం పద్ధతిలో 14-16 రోజుల నారును నాటడం వల్ల పిలకల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.
* సాధారణ పద్ధతిలో ఎకరాలో నాటేందుకు రోజుకు 8-10 మంది కూలీలు అవసరం. కానీ యంత్రంతో ఎకరాలో నాట్లను సుమారు రెండు గంటల్లో పూర్తి చేయవచ్చు.
* యంత్రంతో నాటినప్పుడు.. సాళ్ల మధ్య, మొక్కల మధ్య ఎడం తగినంత ఉండటం వల్ల మొక్కల సాంద్రత బాగుంటుంది. దీంతో చీడపీడల సమస్య తగ్గుతుంది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.