close
పెసరలో సస్యరక్షణ

న్యూస్‌టుడే, పీలేరు గ్రామీణ (చిత్తూరు జిల్లా)

పెసరను ఆశించి నష్టం కలిగించే చీడపీడల నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలను వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు మజిద్‌ అహమ్మద్‌ వివరించారు.

బూడిద తెగులు :  పంట నెల రోజుల దశలో.. ఆకులపై బూడిద మాదిరి మచ్చలు ఏర్పడతాయి. నివారణకు లీటరు నీటికి 1 గ్రాము కార్బండిజమ్‌ లేదా 1 గ్రాము థయోఫానేట్‌ మిథైల్‌ చొప్పున కలిపి 10-15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.

ఆకుముడత తెగులు : ఇది వైరస్‌ తెగులు. తామర పురుగుల ద్వారా వ్యాపిస్తుంది. ఈ తెగులు సోకిన ఆకుల అంచులు వెనకకు తిరిగి గిడసబారి రాలిపోతాయి. ఆకు అడుగున ఈనెలు రక్తవర్ణంలో ఉంటాయి. లేత దశలో మొక్కల తలలు వాడి ఎండిపోతాయి. ఈ తెగులు సోకిన మొక్కలను తొలగించి కాల్చేయాలి. తామరపురుగుల నివారణకు లీటరు నీటికి 1 గ్రా. ఎసిఫేట్‌ లేదా 2 మి.లీ. డైమిథోయేట్‌ లేదా 1 మి.లీ. ఫిప్రోనిల్‌ చొప్పున కలిపి పైరుపై పిచికారీ చేయాలి. ఎంజీజీ-295, ఎల్‌జీజీ-460 రకాలు ఈ తెగులును తట్టుకుంటాయి.

బంగారుతీగ (కస్కుటా) : మాగాణుల్లో సాగుచేసే పెసరలో బంగారు తీగ వ్యాపించి మొక్కల నుంచి రసాన్ని పీల్చేస్తుంది. ఈ తీగ వ్యాపించిన మొక్కలను తొలగించాలి. పైరు 20 రోజులప్పుడు దీని ప్రభావం అధికంగా ఉంటే.. పర్‌స్యూట్‌ కలుపు మందును ఎకరాకు 200 మి.లీ. (200 లీటర్ల నీటికి   కలిపి) చొప్పున పిచికారీ చేయాలి. ఈ మందు చల్లిన 5-6 రోజుల వ్యవధిలో లీటరు నీటికి 10 గ్రా. యూరియా చొప్పున కలిపి పైరుపై పిచికారీ చేయాలి.

బ్యాక్టీరియా ఎండుతెగులు (బ్యాక్టీరియల్‌ బ్లైట్‌) : ఆకులపై గోధుమరంగు మచ్చలు ఏర్పడతాయి. నివారణకు 10 లీటర్ల నీటికి 30 గ్రా. కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ + 2 గ్రా. ప్లాంటోమైసిన్‌ చొప్పున కలిపి 12 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా.. పంట విత్తేముందు తప్పనిసరిగా విత్తనశుద్ధి (లీటరు నీటికి 1 గ్రా. పొషామైసిన్‌ కలిపి కిలో విత్తనాన్ని అరగంట నానబెట్టాలి)చేయాలి.

పల్లాకు (ఎల్లోమొజాయిక్‌) తెగులు : తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది. ఆకులు, కాయలపై పసుపుపచ్చ పొడమచ్చలు ఏర్పడతాయి. ఈ లక్షణాలున్న మొక్కలను గమనిస్తే.. తొలగించి కాల్చివేయాలి. నివారణకు.. లీటరు నీటికి 1.6 మి.లీ. మోనోక్రోటోఫాస్‌ లేదా 2 మి.లీ. డైమిథోయేట్‌ లేదా ట్రైజోఫాస్‌ 1.5 మి.లీ. లేదా 10 లీటర్ల నీటికి ఎసిటామిప్రిడ్‌ 2 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్‌ 3 మి.లీ. చొప్పున కలిపి పైరుపై పిచికారీ చేయాలి. ఎల్‌జీజీ-407, ఎల్‌జీజీ-460 రకాలు ఈ తెగులును తట్టుకుంటాయి.

సెర్కొస్పొరా ఆకుమచ్చ తెగులు : ఆకులపై గోధుమరంగు మచ్చలు ఏర్పడి ఆకు రాలిపోతుంది. నివారణకు లీటరు నీటికి 2 గ్రా. మాంకోజెబ్‌ లేదా 1 గ్రా. క్లోరోథరోనిల్‌ లేదా 1 గ్రా. కార్బెండిజమ్‌ లేదా 1 గ్రా. థయోఫానేట్‌ మిథైల్‌ చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
పురుగులు

చిత్తపురుగు : పంట రెండాకుల దశలో ఈ పురుగు ఆశించి ఆకులపై రంధ్రాలను చేస్తుంది. నివారణకు.. లీటరు నీటికి 2.5 మి.లీ. క్లోరోఫైరిఫాస్‌ లేదా ఎసిఫేట్‌ 1 గ్రా. లేదా మోనోక్రోటోఫాస్‌ 1.6 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.

తామర పురుగు : ఇది పంట లేత దశలో ఆకు అడుగు భాగం నుంచి రసాన్ని పీల్చేడం ద్వారా ఆకు రాలిపోతుంది. నివారణకు.. లీటరు నీటికి మోనోక్రోటోఫాస్‌ 1.6 మి.లీ. లేదా ఎసిఫేట్‌ 1 గ్రా. లేదా ఫిప్రోనిల్‌ 1 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.

తెల్లదోమ : ఇది ఆకుల నుంచి రసాన్ని పీల్చేస్తుంది. పల్లాకు తెగులు (ఎల్లో మొజాయిక్‌)ను వైరస్‌ వ్యాప్తిజేస్తుంది. నివారణకు.. లీటరు నీటికి 1.6 మి.లీ మోనోక్రోటోఫాస్‌ లేదా ట్రైజోఫాస్‌ 2 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.

లద్దె పురుగు : వీటికి చెందిన తొలిదశ లార్వా పురుగులు.. ఆకులను గీరి తినడంవల్ల అవి తెల్లబారి, జల్లెడలా మారుతాయి. క్రమేణా ఇవే ఎదిగి, ఎర్రగొంగళి పురుగులుగా మారి ఆకులను, పువ్వులను, పిందెలను తింటాయి. రాత్రి పూటే ఇవి పైరుపై దాడిచేస్తాయి. వీటి నివారణకు.. జల్లెడగా మారిన ఆకులను తొలగించి, ఆకులపై గుడ్లను ఏరివేయాలి. ఎకరానికి 20 వేల ట్రైకోగ్రామ బదనికలను వారం రోజుల వ్యవధితో రెండుసార్లు వదలాలి. ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను చేలో అక్కడక్కడ పెట్టాలి. ఎన్‌.పి.వి 200 మి.లీ. ద్రావణాన్ని సాయంత్రం పూట పిచికారి చేయాలి. పురుగు ఎక్కువగా ఉన్నప్పుడు.. ఎకరాకు మోనోక్రొటోఫాస్‌ అర లీటరు లేదా క్లోరిపైరిఫాస్‌ అర లీటరు లేదా థయోడికార్బ్‌ 200 గ్రా. 5 కిలోల తవుడు, అరకిలో బెల్లం కలిపి చిన్నచిన్న ఉండలుగా చేసి సాయంత్రం పూట పొలంలో వెదజల్లాలి. అవసరమైతే.. లీటరు నీటికి క్లోరిపైరిఫాస్‌ 2.5 మి.లీ. లేదా నోవాల్యూరాన్‌  మి.లీ. లేదా థయోడికార్బ్‌ 1 గ్రా. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.