close
చెరకును పక్వ దశలోనే నరకాలి!

ఏడాదిపాటు శ్రమించి సాగుచేసిన చెరకు తోటలు ప్రస్తుతం కీలకమైన పక్వదశలో ఉన్నాయి. రాష్ట్రంలోని పంచదార ఫ్యాక్టరీలు క్రషింగ్‌ను ప్రారంభించనున్నాయి. ఈ నేపథ్యంలో చెరకు రైతులు అధిక దిగుబడులను, తద్వారా మేలైన రాబడులు పొందేందుకు పక్వదశలో చేపట్టాల్సిన జాగ్రత్తలు..

టన్ను చెరకును క్రషింగ్‌ చేస్తే.. 95 కిలోల పంచదార ఉత్పత్తయితే- దాన్ని సాధారణ దిగుబడిగా పరిగణిస్తారు. దీనికి ప్రభుత్వం నిర్ణయించిన ధరను చెల్లిస్తారు. టన్ను చెరకు నుంచి ఎక్కువ పంచదార దిగుబడి వస్తే.. అదనపు ధర లభించే అవకాశం ఉంటుంది.
కొన్ని సందర్భాల్లో చెరకును చీడపీడలు ఆశించి నష్టం కలిగిస్తాయి. చీడపీడల బారినపడిన తోటలను ముందుగానే నరికించాలి. ఆలస్యమైతే రస నాణ్యత క్షీణించి, బరువు తగ్గే ప్రమాదం ఉంటుంది.

క్రషింగ్‌ ప్రారంభానికి కొన్ని రోజుల ముందు పంచదార ఫ్యాక్టరీలకు చెందిన వ్యవసాయ సిబ్బంది పక్వత నిర్ధారణ పరీక్షలు చేపడతారు. ఇందుకోసం ‘రిఫ్రాక్టో మీటరు’ను వినియోగిస్తారు. చెరకు గడలోని మొదలు, చివర, మధ్య భాగాల్లో నుంచి రసాన్ని తీసి రిఫ్రాక్టో మీటరుపై వేసి రస నాణ్యతను పరీక్షిస్తారు. రసనాణ్యత 20కి మించి నమోదైనప్పుడు, చెరకు పక్వానికి వచ్చినట్టుగా భావిస్తారు. తోటలో కొన్ని గడలను నరికించి, ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో పనిచేసే మినీల్యాబ్‌కు పంపుతారు. అక్కడ మరోసారి చెరకు పక్వతను నిర్ధారించిన తరువాత చెరకు నరికేందుకు పర్మిట్లు మంజూరు చేస్తారు. ఆయా తేదీల్లో చెరకును ఫ్యాక్టరీకి చేర్చటం వల్ల రసనాణ్యత బాగుంటుంది. దీంతో అధిక ధర గిట్టుబాటవుతుంది.

పక్వత గుర్తింపు
చెరకు పక్వతను రైతులు కూడా గుర్తించే వీలుంది. ఆకుల్లో పచ్చదనం తగ్గి, పసుపు లేదా ఎరుపు రంగుకు మారటాన్ని బట్టి చెరకు పక్వానికి వచ్చిందని గ్రహించవచ్చు. ఈ దశలో చెరకు పెరుగుదల తగ్గుతుంది. కణుపులు దగ్గర దగ్గరగా వస్తాయి. మొవ్వు ఆకులు సైతం గిడసబారి ఉంటాయి. ఈ లక్షణాలు తోటల్లో కనిపించినప్పుడు, ఆ తోట పక్వానికి వచ్చిందని భావించాలి. ఈ తోటలకు నీరు పెట్టడం ఆపేయాలి. ఈ దశలో నీరు పెడితే చెరకులోకి నీరు చేరి, రస నాణ్యత క్షీణించే ప్రమాదం ఉంది. ఈ సమయంలో ఎరువులు కూడా వేయకూడదు.


ఈ  జాగ్రత్తలు పాటించాలి

* పర్మిట్ల మంజూరుకు ముందే చెరకు నరికేందుకు కూలీలను, రవాణా వాహనాలను సిద్ధం చేసుకోవాలి. ఏదైనా కారణం వల్ల మంజురైన పర్మిట్లు రద్దయితే మళ్ళీ పర్మిట్లు రావటానికి కొంతకాలం ఆగాల్సి వస్తుంది. రైతులు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి.
* నరికిన చెరకును వెంటనే ఫ్యాక్టరీకి తరలించకుండా పొలంలో నిల్వచేస్తే రస నాణ్యత క్షీణిస్తుంది. బరువు తగ్గుతుంది. ఫలితంగా రైతుకు నష్టం కలుగుతుంది. చెరకు నరికిన 24 గంటల్లో ఫ్యాక్టరీకి తరలించగలిగితే అధిక ప్రయోజనం ఉంటుంది.
* చెరకు మొక్క తోటలకన్నా, పిలక (కార్శి) తోటలు ముందుగా పక్వానికి వస్తాయి. అందువల్ల పిలక తోటలనే ముందుగా నరికించటానికి ఏర్పాట్లు చేయాలి.
* కొన్ని సందర్భాల్లో రవాణా వాహనాలు ఆలస్యమవుతుంటాయి. రోజుల తరబడి నరికిన చెరకు పొలంలో నిల్వ ఉంచాల్సిన పరిస్థితులేర్పడతాయి. ఈ సందర్భాల్లో.. నరికిన చెరకును గుట్టలుగా పేర్చి, వాటిపై ఎండాకు లేదా టార్పాలిన్‌ లాంటివి కప్పి ఉంచాలి. ఎండాకును కప్పితే.. దానిపై ఉదయం, సాయంత్రం వేళ కొద్దిగా నీటిని చిలకరిస్తుండాలి.
* కూలీలు చెరకును భూమట్టానికి పైకి నరుకుతుంటారు. చెరకు నరికే సమయంలో పర్యవేక్షణ చాలా అవసరం. రైతు ఏ కొంచెం అజాగ్రత్తగా ఉన్నా, కూలీలు చెరకును భూమట్టానికి పైకి నరికే అవకాశం ఉంది. ఇలా ఒక ఎకరం పొలంలోని చెరకును ఒక అంగుళం పైకి నరికితే సుమారు టన్ను (ఒక టన్ను చెరుకు ధర ప్రస్తుతం రూ.మూడు వేలు) దిగుబడి తగ్గిపోతుంది. అందువల్ల చెరకును భూమట్టానికి నరికేలా చూడాలి. చాలా మంది కూలీలు మంచి చెరకు గడలను సైతం ఎండాకుల్లో వదిలేస్తుంటారు. దీంతో ఎకరాకు టన్ను, టన్నున్నర చెరకు వృథా అవుతుంది. ఇది రైతుకు నష్టమే.
* పక్వానికి రాని లేత చెరకును ఎట్టి పరిస్థితుల్లోనూ నరికించకూడదు. అలా చేస్తే రైతుకే నష్టం. పక్వదశకు రాని, పక్వదశ దాటిన చెరకు గడల బరువు తక్కువగానే ఉంటుంది. పక్వత కలిగిన చెరకు మాత్రమే ఎక్కువ పంచదార దిగుబడినిస్తుంది.

- దాసరి ఆళ్వారస్వామి, విజయవాడ

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.