close
కర్షకులకు కషాయాల అండ!

విస్తరిస్తున్న ప్రకృతి సేద్యం
తక్కువ ఖర్చు, నాణ్యమైన పంటలు
న్యూస్‌టుడే, టి.నరసాపురం

ఏటా పెరుగుతున్న రసాయన మందుల వాడకంతో రైతుకు పెట్టుబడి భారం అధికమవుతోంది. ఆరుగాలం కష్టించి పనిచేసి పండించిన పంటలో నాణ్యత తగ్గుతోంది. ఈ సమస్యలను అధిగమించేందుకు కషాయాలతో కూడిన ప్రకృతి సాగే మేలైనదని ‘రైతు సాధికార సంస్థ’ నిరూపిస్తోంది. పశ్చిమగోదావరి జిల్లాలో ఈ సంస్థ ఆధ్వర్యంలో 13,161 మంది రైతులు 10,650 ఎకరాల్లో.. ప్రకృతి పద్ధతిలో వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నారు. ఈ విధానంలో సహజ సిద్ధంగా దొరికే చెట్ల ఆకులు, పశువుల మూత్రం ఉపయోగించి కషాయాలను తయారుచేసి వాడుతున్నారు. సాధికార సంస్థ సిబ్బంది సహకారంతో నాణ్యమైన దిగుబడులు సాధిస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.


వివిధ పదార్థాలతో కషాయాల తయారీ విధానం

కోడిగుడ్డు, నిమ్మరసం ద్రావణం
దీని తయారీకి 10 కోడిగుడ్లు, గుడ్లు మునిగేంత నిమ్మరసం, 250 గ్రా. నల్లబెల్లం, వెడల్పు మూతిగల గాజుసీసా కావాలి.
తయారీ విధానం: కోడిగుడ్లను సీసాలో పగలకుండా ఉంచి, అవి మునిగే వరకు నిమ్మరసం పోసి మూత పెట్టాలి. ప్రతిరోజూ పరిశీలిస్తూ.. నిమ్మరసం తగ్గితే మళ్లీ పోస్తుండాలి. మూడు రోజుల తరువాత నల్లబెల్లం వేసి కలియతిప్పాలి. తరువాత ఇలా పది రోజులు ఉంచినప్పుడు గుడ్లు ఈ ద్రావణంలో పూర్తిగా కరిగిపోతాయి(పెంకులతో సహా). 11వ రోజు ఈ మిశ్రమాన్ని ఒక ప్లాస్టిక్‌ గిన్నెలో పోసి కలియతిప్పిన అనంతరం ఈ మిశ్రమాన్ని తిరిగి గాలి తగలని సీసాలో పోయాలి. నాలుగు రోజులకోసారి మూతతీసి గాలి వెళ్లేలా చూడాలి. లేదంటే సీసా పగులుతుంది. ఈ ద్రావణం రెండు నెలల వరకు నిల్వ ఉంటుంది. ఈ ద్రావణాన్ని ఎకరాకు 250 మి.లీ. చొప్పున 100 లీటర్ల నీటిలో కలిపి సాయంత్రం పూట పైరుపై పిచికారి చేయాలి. ఈ ద్రావణంలో స్థూల, సూక్ష్మ పోషకాలు ఉండటం వల్ల మొక్కల పెరుగుదల బాగుంటుంది. నాణ్యమైన దిగుబడి వస్తుంది. పంట పెరిగే దశలో దీన్ని పిచికారి చేయాలి.

పచ్చిమిర్చి, వేప, వెల్లుల్లి, పొగాకు ద్రావణం
దీని తయారీకి.. వేపాకులు రెండు కిలోలు, వెల్లుల్లిపాయలు కిలో, ఆవు మూత్రం 5 లీటర్లు, పొగాకు రద్దు కిలో, పచ్చిమిర్చి కిలో కావాలి.
తయారీ : వేపాకులు, వెల్లుల్లి, పచ్చిమిర్చిని కలిపి మెత్తగా నూరి ముద్ద చేయాలి. దీనికి పొగాకు రద్దు కలపాలి. ఈ ముద్దను 5 లీటర్ల ఆవు మూత్రంలో పదిరోజులపాటు నానబెట్టాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని వడపోసి 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరాలో పిచికారి చేయాలి. ఈ ద్రావణాన్ని నిల్వ ఉంచకూడదు. తయారు చేసిన వెంటనే వాడాలి. శనగపచ్చ పురుగు, లద్దె పురుగు, దాసరి పురుగు, ఎర్రగొంగళి పురుగు, కాయతొలుచు పురుగు, ఆకుముడతల నివారణకు ఉపయోగపడుతుంది.

మారేడు పత్ర కషాయం
దీని తయారీకి మారేడు ఆకులు 5 కిలోలు, సర్ఫ్‌ పొడి 100 గ్రా., 100 లీటర్ల నీరు కావాలి.
తయారీ విధానం: ఈ ఆకులను 10 లీటర్ల నీటిలో అరగంట పాటు ఉడకబెట్టి, చల్లార్చి వడబోయాలి. ఈ కషాయానికి 100 లీటర్ల నీరు + 100 గ్రా. సర్ఫ్‌ పొడి కలిపి ఎకరాలో పిచికారి చేయాలి. వరిలో అగ్గితెగులు, మెడవిరుపు సోకినప్పుడు ఈ ద్రావణాన్ని సాయంత్రం పూట పిచికారి చేయాలి.

వేపగింజల కషాయం
దీని తయారీకి వేపగింజలు 10 కిలోలు, సబ్బు పొడి 200 గ్రా., 200 లీటర్ల నీరు కావాలి.
తయారీ విధానం : నీడలో ఆరబెట్టిన వేపగింజలను మెత్తగా రుబ్బాలి. ఈ పిండిని మూటగట్టి, 10 లీటర్ల నీటిలో 12 గంటలు నానబెట్టాలి. మూటను పిండుతూ కషాయాన్ని తీసి వడగట్టాలి. ఇందులో 200 లీటర్ల నీరు + 100 గ్రా. సబ్బుపొడి కలిపి ఎకరాలో పిచికారి చేయాలి. వరి, వేరుశనగ, మొక్కజొన్న వంటి పంటలకు ఈ కషాయాన్ని వాడవచ్చు. పొగాకు లద్దెపురుగు, శనగపచ్చ పురుగు, కాయతొలుచు పురుగు, రసంపీల్చు పురుగు, ఆకుముడతల నివారణకు ఇది పనికొస్తుంది.

తూటి కాడ కషాయం
దీని తయారీకి.. తూటి కాడ ఆకులు 10 కిలోలు, ఆవు మూత్రం 15 లీటర్లు కావాలి.
తయారీ: తూటి కాడ ఆకులను మెత్తగా నూరి, 15 లీటర్ల ఆవు మూత్రంలో కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా మరిగించి, చల్లార్చాలి. ఈ ద్రావణాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి ఎకరాలో పిచికారి చేయాలి. దీన్ని తయారు చేసినరోజే వాడేయాలి. వరిలో సుడిదోమను నివారిస్తుంది.

శొంఠి-పాలతో కషాయం
దీని తయారీకి.. మెత్తగా పొడిచేసిన శొంఠి 200 గ్రా., ఆవు పాలు 5 లీటర్లు, నీరు 2 లీటర్లు
తయారీ విధానం: మట్టి పాత్రలో రెండు లీటర్ల నీరు, శొంఠి పొడి వేసి కలపాలి. రెండు లీటర్ల ద్రావణం.. లీటరుకు తగ్గే వరకు మరిగించి, చల్లార్చాలి. మరో గిన్నెలో పాలుపోసి పొంగు వచ్చే వరకు మరిగించి, అందులో శొంఠి కషాయాన్ని కలిపితే.. శొంఠి పాల కషాయం తయారవుతుంది. ఈ ద్రావణాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరాలో పిచికారి చేయాలి. దీన్ని అన్ని రకాల పంటల్లో తెగుళ్ల నివారణకు వాడొచ్చు.


ప్రకృతిసాగు చేస్తున్నాం

బలుసు గోపి, సీతంపేట

మా పొలంలో ఈ ఏడాది అరటిలో అంతరపంటగా అల్లం సాగు చేశాం. ప్రకృతి సాగు విధానాలను అనుసరిస్తున్నాం. పంట బాగుంది. తెగుళ్ల బెడద లేదు. పెట్టుబడి ఖర్చులు తగ్గాయి.


పెట్టుబడి తగ్గింది

మళ్ళ అప్పారావు, కొల్లివారిగూడెం

ప్రకృతి విధానంలో మూడెకరాల్లో వరి సాగు చేస్తున్నాం. ప్రస్తుతం పంట కోతదశకు వచ్చింది. రసాయన ఎరువులు, పురుగు మందులను ఉపయోగించడం లేదు. ఎకరాకు పెట్టుబడి ఖర్చు కేవలం రూ.2000-3000 ఉంటుంది.


రైతుల్లో ఆదరణ పెరుగుతోంది
రామాంజనేయరెడ్డి, ప్రకృతిసాగు కార్యకర్త, టి.నరసాపురం (చరవాణి : 91331 21153)

ఇప్పుడిప్పుడే రైతులు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి ప్రకృతి సాగు వైపు దృష్టి సారిస్తున్నారు. ఈ పద్ధతిలో కషాయాలను తయారుచేసి వాడటం వల్ల తెగుళ్ల బెడద తగ్గుతుంది. రైతుకు పెట్టుబడి ఖర్చులు తగ్గడంతో పాటు, నాణ్యమైన పంట, మేలైన దిగుబడులు వస్తాయి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.